టీనేజర్లకు వేయాల్సిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు బదులు ఆరోగ్య సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. ఈ ఘటన బీహారలో జరిగింది. పిల్లలకు కోవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలని డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. కరోనాను ఎదుర్కొవడంలో వ్యాక్సినేషన్ కీలకపాత్ర పోషిస్తుందని భావించిన ప్రభుత్వం 2020 జనవరి నుంచి ప్రజలకు వ్యాక్సిన్ లు వేస్తోంది. కరోనా రెండో వేవ్ ముగిసిన తరువాత ఇటీవలే స్కూల్స్, కాలేజీలు ఓపెన్ చేశారు. దీంతో ఇప్పుడిప్పుడే పిల్లలు చదువుకునేందుకు కాలజీలకు, స్కూల్స్‌కు వెళ్తున్నారు. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన ఎక్కువైంది. కోవిడ్ -19 డెల్టా వేరియంట్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. వీటి నుంచి పిల్లలను రక్షించాలంటే వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బుల్లీ బాయ్ యాప్ కేసు.. కీలక నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
కరోనా వ్యాక్సిన్‌ను పలు ఏజ్ గ్రూప్ ల వారికి విడతల వారీగా అందజేశారు. అయితే ఇటీవల వరకు 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీనేజ్ పిల్లలకు అంటే 15 నుంచి 18 సంవత్సరాలు పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన ప్రభుత్వం సోమవారం నుంచి టీకాలు వేయడం మొదలుపెట్టింది. దీంతో దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో టీనేజ్ పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైనట్టు ప్రకటించింది.
టీనేజ్ పిల్లలకు పెద్దల మాదిరిగా కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్లు కాకుండా కేవలం కోవాగ్జిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు కోవాగ్జిన్ మాత్రమే ఇవ్వడానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకు అదే వ్యాక్సిన్ వేస్తున్నాయి. అయితే బీహార్‌లో మాత్రం ఇద్దరు పిల్లలకు పొరపాటున కోవాగ్జిన్ కు బదులుగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. తరువాత జరిగిన పొరపాటును గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షరీఫ్ ప్రాంతంలోని ఫ్రొఫెసర్ కాలనీకి చెందిన పీయూష్ రంజన్ కు ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు ఆర్యన్, మరొకరు కిరణ్. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు తండ్రి పీయూష్ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించాడు. అయితే అక్కడి ఆరోగ్య సిబ్బంది పిల్లలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందజేశారు. నిజానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించలేదు. అందుకే పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన కోవాగ్జిన్ అందించాలని డీసీజీఐ నిర్ణయించింది.
ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీంతో పిల్లలిద్దరిని కొన్ని గంటల పాటు డాక్టర్ల పరిశీలనలో ఉంచారు. టీకా వేసే వ్యక్తికి కరోనా సోకడంతో అతడు సెలవులో ఉన్నాడని, కొత్త సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ వేశారని అక్కడి అధికారులు చెప్పారు. పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా ప్రభుత్వమే పూర్తి చికిత్స అందిస్తుందని వారు హామీ ఇచ్చారు. అయితే పిల్లలకు కోవిషీల్డ్ టీకా ఇచ్చినప్పటికీ వారికి వచ్చిన కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లో మాత్రం కోవాగ్జిన్ అందిచనట్టు నమోదు అయ్యింది.
