ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఫోటోలను ఇంటర్‌ నెట్‌లో అప్‌లోడ్ చేసి వారిని వేలం వేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న బుల్లీ బాయ్ యాప్ (Bulli Bai app) వ్యవహరం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా కీలక నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 

ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఫోటోలను ఇంటర్‌ నెట్‌లో అప్‌లోడ్ చేసి వారిని వేలం వేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న బుల్లీ బాయ్ యాప్ (Bulli Bai app) వ్యవహరం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ సెల్ పోలీసులు (Mumbai Cyber cell Police) నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లీ బాయ్ యాప్‌తో సంబంధం ఉన్న ఓ మహిళను పోలీసులు ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ప్రధాన నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఇదివరకే బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ముంబైకి తరలించారు. అతడిని విశాల్ కుమార్‌గా గుర్తించారు. 

అయితే విశాల్ కుమార్‌, ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న మహిళ.. ఇద్దరు ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. ‘ప్రధాన నిందితురాలిగా ఉన్న మహిళకు బుల్లి యాప్‌కు సంబంధించి మూడు అకౌంట్లను నిర్వహిస్తుంది. మరో నిందితుడు విశాల్ కుమార్ బుల్లీ బాయ్ యాప్‌లో Khalsa supremacist పేరుతో అకౌంట్ తెరిచాడు. డిసెంబర్ 31న అతడు ఇతర ఖాతాల పేర్లను సిక్కు పేర్లను పోలి ఉండేలా మార్చాడు. నకిలీ Khalsa ఖాతాదారులను చూపించాడు’ అని ముంబై పోలీసులు తెలిపారు. 

Also Read: Bulli Bai: బుల్లిబాయ్ యాప్ కేసు.. ఒక‌రి అరెస్టు.. స‌మాచారం లేద‌న్న బెంగ‌ళూరు పోలీసులు !

ఇదిలా ఉంటే.. ముస్లిం మహిళల ఫొటోలు అప్‌లోడ్ చేసి వారు అమ్మకానికి ఉన్నారంటూ తప్పుడు ప్రకటనలు ఇచ్చే బుల్లీ బాయ్ అనే యాప్ వ్యవహారం ఇటీవల వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దుండగులు మెక్రోసాఫ్ట్‌కు చెందిన గిట్‌హబ్ ప్లాట్‌ఫాం ఆధారంగా చేసుకుని దీనిని రూపొందించారు. ఈ యాప్‌ను ట్విట్టర్‌లో @bullibai పేరుతో ప్రచారం చేశారు. ఈ ఖాతా డీపీగా ఖలిస్తానీ మద్దతుదారుడి చిత్రం ఉంచారు. ఈ యాప్ బాధితుల్లో ముస్లిం మతానికి చెందిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థినిలు, ప్రముఖులు కూడా ఉన్నారు. 

ఈ యాప్ వ్యవహారాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది.. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ముంబై పోలీసులకు లేఖ రాశారు. దీంతో పోలీసులు ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశారు. మరోవైపు ఇస్మాత్ ఆరా అనే జర్నలిస్టు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. 

ఇదిలా ఉంటే దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. బుల్లీ బాయ్‌ను గిట్‌హబ్ బ్లాక్ చేసిందని తెలిపారు. పోలీసులతో పాటు, సంబంధిత అధికార యంత్రాంగం కూడా ఇందుకు సంబంధించి విచారణ కొనసాగిస్తుందని వెల్లడించారు.