రాజస్థాన్ హైకోర్టు అసమ్మతి ఎమ్మెల్యే సచిన్ పైలెట్ వర్గం వాదనతో ఏకీభవించింది.కేంద్రాన్ని కూడ ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పైలెట్ వర్గం వాదనతో హైకోర్టు ఏకీభవించింది.మరో వైపు అసమ్మతి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా యధాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదిస్తారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ తరపున ప్రతీక్ ఖస్లీవాల్ వాదనలు విన్పించనున్నారు. ఈ కేసు విచారణను హైకోర్టు  శుక్రవారం నాడు ఉదయం 10:30 గంటల తర్వాత 15 నిమిషాల పాటు వాయిదా వేసింది.15 నిమిషాల విరామం తర్వాత హైకోర్టు ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెల్లడించింది. సచిన్ పైలెట్ సహా మరో 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు  వేయకుండా యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది

also read:సచిన్ పైలెట్‌కు ఊరట: రేపు హైకోర్టు తీర్పుకు గ్రీన్ సిగ్నల్, అనర్హతపై సుప్రీం కీలక ఆదేశం

స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలెట్ సహా 18 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 17వ తేదీన రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. అసమ్మతి వర్గం ఎమ్మెల్యేలపై ఈ నెల 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు ఈ నెల 21న ఆదేశించింది. అంతేకాదు ఈ నెల 24వ తేదీన ఈ విషయమై తీర్పును వెల్లడించనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. 

అనర్హత నోటీసులపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాజస్థాన్ స్పీకర్ జోషీ బుధవారం  నాడు  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తమ నిర్ణయం వచ్చేవరకు రెబెల్స్  పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకొనే వరకు రాజస్థాన్ స్పీకర్ అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవద్దని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. అంతేకాదు  ఈ నెల 24వ తేదీన తన తీర్పును వెల్లడించేందుకు రాజస్థాన్ హైకోర్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 

పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విఫ్ స్పీకర్ కు సచిన్ పైలెట్  సహా 18 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పీకర్ సీపీ జోషీ అసమ్మతి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు సచిన్ వర్గం.