యోగీ ఆదిత్యనాథ్ ను నోయిడా అపశకునం వెంటాడుతోందా?

యోగీ ఆదిత్యనాథ్ ను నోయిడా అపశకునం వెంటాడుతోందా?

లక్నో: నోయిడా అపశకునం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను వెంటాడుతోందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. కైరానా పార్లమెంటు ఉప ఎన్నికలో బిజెపి ఓడిపోయిన తర్వాత దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. నోయిడాను సందర్శించిన ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఓడిపోతారనే నమ్మకం ఒకటి ఉంటూ వచ్చింది.

అయితే, ఆ నమ్మకాన్ని తోసిరాజంటూ నోయిడాను, గ్రేటర్ నోయిడాను  యోగి ఆదిత్యనాథ్ గత డిసెంబర్ లో సందర్శించిన తర్వాత బిజెపి వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ నమ్మకాన్ని లెక్క చేయకుండా నోయిడాను సందర్శించిన యోగి ఆదిత్యనాథ్ ను రాజకీయ వర్గాలు, మీడియా ప్రశంసించాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయనను కొనియాడారు. 

వీరు బహదూర్ సింగ్ 1980 దశకం చివరలో పదవీచ్యుతుడు అయినప్పటి నుంచి నోయిడా సందర్శన కలిసి రాదనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. నోయిడా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే కాంగ్రెసు అధి,్టానం ఆయనను పదవి నుంచి తొలగించింది.

అప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా నోయిడాకు వెళ్లడానికి ధైర్యం చేయలేదు. రాజ్ నాథ్ సింగ్ 2000, 2002 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ నోయిడాకు వెళ్లలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 2003లో నోయిడాను సందర్శించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాలేదు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెట్రో సర్వీస్ ప్రారంభ కార్యక్రమానికి వెళ్లారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. 

ఆదిత్యనాథ్ మాత్రం నమ్మకాన్ని లెక్క చేయకుండా కొత్త మెట్రో లైన్ ను ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం చెప్పడానికి 2017 డిసెంబర్ లో నోయిడా సందర్శించారు. ఆదిత్యనాథ్ చేసిన ధైర్యాన్ని మోడీ ప్రశంసించారు. విశ్వాసం ముఖ్యమే గానీ మూఢ నమ్మకం ఉండకూడదని ఆయన ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి అన్నారు. అయితే, వరుసగా ఎన్నికల్లో బిజెపి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటమి పాలు అవుతుండడంతో అదే ఆదిత్యనాథ్ ను వెంటాడుతోందనే ప్రచారం సాగుతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page