World Cup 2023: పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ కోసం హర్యానాకు చెందిన లియాఖత్ ఖాన్ ఎదురుచూపులు.. ఎందుకో తెలుసా?

పాకిస్తాన ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ కోసం హర్యానాకు చెందిన లియాఖత్ ఖాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా ఇండియా టీమ్‌తో, పాకిస్తాన్ టీమ్ అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కుటుంబ సమేతంగా వస్తున్న అల్లుడు హసన్ అలీ కోసం లియాఖత్ ఖాన్ ఎదురుచూస్తున్నాడు. 
 

haryana man liaquat khan awaiting pakistan fast bowler hasan ali family, know here why? kms

న్యూఢిల్లీ: హర్యానాలోని నూహ్ జిల్లా చందైని గ్రామానికి చెందిన రిటైర్డ్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లియాఖత్ ఖాన్ పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ కోసం ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్, ఇండియా టీమ్‌లు అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం లియాఖత్ ఖాన్ ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ తన భార్య సామియా ఖాన్, కూతురుతో కలిసి భారత్‌కు వస్తున్నారు. లియాఖత్ ఖాన్‌కు హసన్ అలీ అల్లుడు.

హసన్ అలీ భార్య సామియా ఖాన్ లియాఖత్ ఖాన్ కూతురు. సామియా, హసన్ అలీ 2019లో అబుదాబిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమె ఇండియాకు రాలేదు. లియాఖత్ ఖాన్ కూడా తన బిడ్డ సామియా ఖాన్‌ను చివరగా చూసింది ఆమె పెళ్లిలోనే. ఇప్పటికీ సామియా బిడ్డ, తన మనవరాలిని చూడనేలేదు. 

‘నా కూతురు సామియా ఖాన్ గర్భం దాల్చిన తర్వాత నా భార్య పాకిస్తాన్‌కు 2021లో వెళ్లింది. ఆమె డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉన్నది. ఇప్పుడు మళ్లీ మేమంతా కలిసే అవకాశం వస్తున్నది. అహ్మదాబాద్‌లో మేమంతా కలుస్తామని ఆశిస్తున్నాను. నా మనవరాలిని కలవడానికి ఎదురుచూస్తున్నాను’ లియాఖత్ ఖాన్ అన్నాడు.

పాకిస్తాన్ టీమ్‌లో ఫాస్ట్ బౌలర్‌గా హసన్ అలీ ఎంపికయ్యారు. వేరే ఆటగాడు గాయం కారణంగా భారత్‌కు రావడం కుదరలేదు. ఆయన స్థానంలో హసన్ అలీ ఎంపికయ్యాడు.

అయితే, ఈ అదృష్టకర మలుపు ఇండియా-పాకిస్తాన్ కుటుంబం కలవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఈ మలుపుతోనే లియాఖత్ ఖాన్ తన మనవరాలిని తొలిసారిగా చూడబోతున్నాడు.

‘నేను రూమీని అనుసరిస్తాను. నా కాలేజీ రోజుల్లో ఆయన రచనలు విరివిగా చదివేవాడిని. ‘ఈ గుంపు చెప్పేది కాదు, నీ మనసు చెప్పేది విను’ అని ఆయన చెప్పిన మాటను సత్యంగా భావిస్తాను’ అని లియాఖత్ ఖాన్ చెప్పాడు.

‘నా కూతురు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ ఇంజినీర్‌గా చేస్తున్నది. అప్పుడే ఆమె దుబాయ్‌లో హసన్ అలీని కలిసింది. హసన్ గురించి నా బిడ్డ నాకు చెప్పింది. ఆమె తన భాగస్వామిని ఎంచుకునే నిర్ణయాన్ని నేను విశ్వసించాను’ అని లియాఖత్ ఖాన్ వివరించాడు.

Also Read: రెడ్ సిగ్నల్ జంప్ చేసి, వేగంగా కారును ఢీకొట్టిన బస్సు.. 10 మందికి గాయాలు.. వీడియో వైరల్

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఎవరికి సపోర్ట్ చేస్తావు అని లియాఖత్ ఖాన్‌ను అడగ్గా.. ‘నేను సునీల్ గవస్కర్, కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, మొహమ్మద్ అజహరుద్దీన్ ఆటను చూశాను. విరాట్ కోహ్లీకి అభిమానిని. విరాట్ కోహ్లీని ఎక్కువగా అభిమానిస్తాను’ అని లియాఖత్ ఖాన్ తెలిపాడు.

‘ఈ కాలంలో విరాట్ కోహ్లీ కంటే కూడా మంచి ఆటగాడు ఉన్నాడని నేను అనుకోను. కొన్ని రోజులుగా ఆయన ఫామ్‌లో లేడు. కానీ, ఇప్పుడు ఆయన మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. నేను హసన్‌ను కలిసినప్పుడు మన ఇండియా ఆటగాళ్లను పరిచయం చేయమని అడుగుతాను. విరాట్ కోహ్లీతో పొటో తీసుకోవాలని అనుకుంటున్నాను. రాహుల్ ద్రావిడ్‌కు హలో చెప్పాలని అనుకుంటున్నాను’ అని లియాఖత్ కాన్ వివరించాడు.

భారత్, పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు ఉండాలని ప్రతిరోజూ పూజిస్తానని లియాఖత్ ఖాన్ చెప్పాడు. ‘అల్లాకు నేను చేసే ఏకైక ప్రార్థన ఏమిటంటే, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవ్వాలనే. భారత్, పాకిస్తాన్ మధ్య ఎక్కువ మ్యాచ్‌లు, సిరీస్‌లు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రెండు దేశాల మధ్య ఎక్కువ క్రికెట్ మ్యాచ్‌లు ఉండాలని ఆశిస్తాను’ అని లియాఖత్ తెలిపాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios