Asianet News TeluguAsianet News Telugu

రెడ్ సిగ్నల్ జంప్ చేసి, వేగంగా కారును ఢీకొట్టిన బస్సు.. 10 మందికి గాయాలు.. వీడియో వైరల్

ఓ బస్సు ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసి, మరో వైపు నుంచి వస్తున్న కారును వేగంగా ఢీకొట్టింది. అయితే కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలూ కాలేదు. బస్సులో ఉన్న 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

A bus jumped a red signal and rammed into a speeding car.. 10 people were injured.. Video went viral..ISR
Author
First Published Oct 5, 2023, 1:35 PM IST

అది ఓ చౌరస్తా. నాలుగు దారులను కలిపే ప్రదేశం కాబట్టి పోలీసులు అక్కడ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ‘ట్రాఫిక్ సిగ్నల్స్ కంట్రోలర్ ’ ను ఏర్పాటు చేశారు. అయితే ఓ బస్సు వేగంగా వస్తూ.. రెడ్ సిగ్నల్ పడినా ఆగలేదు. మరో వైపు గ్రీన్ సిగ్నల్ ఉండటంతో ఆ దారి నుంచి కారు కూడా వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో ఈ ఘటన జరిగింది. సెక్టార్ 5లోని అత్యంత రద్దీగా ఉండే కాలేజ్ జంక్షన్ వద్ద సోమవారం (అక్టోబర్ 2) ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుకు ఓ వైపు నుంచి వేగంగా వస్తున్న బస్సు రెడ్ సిగ్నల్ ను పట్టించుకోలేదు. రోడ్డుకు అవతలి వైపు నుంచి వస్తున్న ఎస్ యూవీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. బస్సు కూడా బోల్తా పడినంత పనయ్యింది. ఈ ఘటన ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డవగా, ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను రక్షించేందుకు పలువురు బస్సు, ఎస్యూవీ వైపు పరుగులు తీశారు. అవి కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ టూ వీలర్ నడిపే వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయని ‘టెలిగ్రాఫ్’ రిపోర్టు తెలిపింది. బైక్ పై ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించడం వల్ల తీవ్ర గాయాలు కాలేదని పేర్కొంది. అదే సమయంలో కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడం వల్ల అందులో ఉన్న వారికి కూడా ఎలాంటి గాయాలూ కాలేదు. 

అయితే  బస్సు డ్రైవర్ తో పాటు మరో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును, కారును విడిపించారు. దీంతో చౌరస్తాలో 40 నిమిషాల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios