హర్యానాలో రైతుల ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఏకంగా సీఎం మనోహర్‌లాల్ ఖట్టార్ నివాసం ముందే వేయి మంది వరకు ఆందోళనకారులు గుమిగూడి నిరసనలు చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు.
చండీగడ్: కేంద్ర తెచ్చిన మూడు చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళనలు ఉధృతంగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానాల్లో వీటి తీవ్రత అధికంగా ఉన్నది. హర్యానాలో అధికారపార్టీల నేతల కార్యక్రమాలనూ అడ్డుకుంటూ తీవ్ర పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, సుమారు వేయి మంది రైతు ఆందోళనకారులు సీఎం మనోహర్‌లాల్ ఖట్టార్ నివాసం ముందు గుమిగూడారు. శనివారం ఉదయం నుంచే నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున రైతులు గుమిగూడి ప్రదర్శనలు చేశారు. రాత్రంతా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.
కర్నాల్‌లోని సీఎం నివాసం ముందున్న బారికేడ్లను ఎక్కి మరీ దాటి వెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి హర్యానా పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ, ఆందోళనకారులను నిలువరించలేకపోయారు. వారు ఆ బారికేడ్లను దాటగానే ఎదురుగానున్న వాహనం నుంచి వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు. వెంటనే నిరసనకారులు చెల్లాచెదురైపోయారు.
హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ, జేజేపీ నేతల కార్యక్రమాలను రైతులు అడ్డుకుంటున్నారు. ఇటీవలే హర్యానా ఉపముఖ్యమంత్రి చౌతలా హాజరుకానున్న ఓ కార్యక్రమం దగ్గరా రైతులు ఆందోళన చేశారు. ఆయన ఎదుటే నల్ల జెండాలతో ప్రదర్శన చేశారు.
