కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలలుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ శివార్లలో రోడ్లపైనే టెంట్లు, గుడారాలు వేసుకుని నిద్రాహారాలకు మాని అన్నదాతలు నిరసన కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు మరణించాడు. నిరసనలు జరుగుతున్న టిక్రీ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో.. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

మృతుడిని హర్యానా రాష్ట్రం జిండ్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 52 ఏళ్ల కరమ్‌వీర్‌ సింగ్‌‌గా గుర్తించారు. ఇక్కడున్న ఓ పార్కులో అతను ఆదివారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించారని పోలీసులు పేర్కొన్నారు.

Also Read:అదే భద్రత, అదే పహారా.. ఢిల్లీలో కొనసాగుతున్న హై అలర్ట్

సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. దానిని స్వయంగా మృతుడు రాసినట్లుగా భావిస్తున్నారు. ఈ లేఖలో మోడీ ప్రభుత్వం తేదీ తర్వాత మరో తేదీని ప్రకటిస్తోందని, కానీ వ్యవసాయ చట్టాలు మాత్రం ఎప్పుడు రద్దవుతాయో ఎవరికీ తెలీదని అభిప్రాయపడ్డారు.

కరమ్‌వీర్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రెండు వారాల క్రితం హరియాణాకే చెందిన మరో రైతు.. విషం తాగి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.