టీచర్లు చెప్పే పాఠాలు బుద్ధిగా విని, నేర్చుకోవాల్సిన విద్యార్థులు పాఠశాలలను రక్తపు మడుగులు చేస్తున్నారు. పరీక్ష క్యాన్సిల్ కావాలని గతేడాది ఓ విద్యార్థి మరో విద్యార్థిని దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనే మరోకటి జరిగింది.

పాఠశాలలో ఓ అమ్మాయి గురించి ఓ విద్యార్థి ఎక్కువగా మాట్లాడాడనే కోపంతో నలుగురు తోటి విద్యార్థులు కలిసి తరగతి గదిలో అతన్ని కత్తులతో పొడిచి చంపిన ఘటన హర్యానా రాష్ట్రంలోని పిల్లుఖేరా పట్టణంలో జరిగింది. పిల్లుఖేరా పట్టణంలోని జింద్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో అంకూష్ (18) అనే విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. 

ఓ అమ్మాయి గురించి అంకూష్ ఎక్కువగా మాట్లాడాడనే కోపంతో నలుగురు స్నేహితులు తమ బ్యాగుల్లో కత్తులు వేసుకొని పాఠశాలకు వచ్చారు. తరగతి గదిలో నుంచి ఉపాధ్యాయుడు బయటకు వెళ్లగానే సంచుల్లో నుంచి కత్తులు తీసిన నలుగురు విద్యార్థులు అంకూష్ ను పొడిచారు. మరో టీచరు రాగానే కత్తులతో పొడిచిన నలుగురు విద్యార్థులు ‘‘తర్వాత నిన్ను చంపేస్తాం’’ అంటూ పారిపోయారు. 

తీవ్రంగా గాయపడిన అంకూష్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. నిందితులైన మైనర్ బాలురపై ఐపీసీ సెక్షన్ 323, 324,506, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి కిషోరి లాల్ చెప్పారు. నిందితులైన విద్యార్థులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వివరించారు.