బుధవారం హర్యానా బోర్డు 12వ తరగతి హిందీ పేపర్ కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. దీంతో అధికారులు 3 కేంద్రాల్లోని పరీక్షలను రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్ లో కూడా 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ కూడా నిన్న లీకైంది. దీంతో 24 జిల్లాల పరిధిలో పరీక్షను రద్దు చేశారు. ఇలా బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు రెండు రాష్ట్రాల్లో లీక్ ఆందోళనకరం. 

12వ త‌ర‌గ‌తి హిందీ బోర్డు ప‌రీక్ష‌.. విద్యార్థులంద‌రూ ప‌రీక్ష రాసేందుకు కేంద్రానికి చేరుకున్నారు.. మ‌రో 15 నిమిషాల్లో ప‌రీక్ష ప్రారంభ‌మ‌వ‌బోతోంది.. ఉన్న‌ట్టుండి ఆ స్టూడెంట్ల‌కు ప‌రీక్ష క్యాన్సిల్ అయ్యింద‌ని తెలిసింది. ఎందుకు ? ఏం జ‌రిగింద‌ని ఆరా తీస్తే మ‌రి కొద్ది నిమిషాల్లో ప్రారంభ‌మ‌య్యే ప‌రీక్ష‌కు సంబంధించిన ప్ర‌శ్నాప‌త్రం లీక్ అయ్యింద‌ని తెలిసింది. ఇక చేసేదేమీ లేక క‌ష్ట‌ప‌డి చ‌దివిన విద్యార్థులు అంద‌రూ ప‌రీక్ష రాయ‌కుండానే వెనుదిరిగారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలో చోటు చేసుకుంది. 

హర్యానా బోర్డు 12వ త‌ర‌గ‌తి హిందీ పేప‌ర్ ప‌రీక్ష బుధ‌వారం నిర్వ‌హించాల్సి ఉంది. అయితే ఆ ప‌రీక్ష‌కు సంబంధించిన ప్ర‌శ్నాప‌త్రం 15 నిమిషాల ముందు వైర‌ల్ అయ్యింది. ఆ చుట్టుప‌క్క‌ల వ్య‌క్తుల వాట్సాప్ గ్రూపుల్లో చ‌క్క‌ర్లు కొట్టింది. దీంతో పేప‌ర్ లీక్ అయిన ప‌రిస‌రాల్లో ఉన్న మూడు కేంద్రాల్లో ప‌రీక్ష‌ను ర‌ద్దు చేశారు. 

అధికారులు, స్థానిక మీడియా సంస్థ‌లు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. హ‌ర్యానా రాష్ట్రంలోని మంధౌలీ గ్రామంలో ఉన్న ప‌రీక్షా కేంద్రం నుంచి ఈ పేప‌ర్ లీక్ జ‌రిగింద‌ని భావిస్తున్నారు. అయితే ఈ పేప‌ర్ లీక్ స‌మ‌యంలో ప్రైవేట్ స్కూల్ టీచ‌ర్ల వ్యాన్ పై దాడి జ‌రిగింద‌ని దిహర్యానా బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఇప్పుడు ఈ టీచ‌ర్లు పోలీసుల విచారణలో ఉన్నార‌ని ఆ బోర్డు చైర్మ‌న్ మీడియాకు తెలిపారు. 

ఈ ఘ‌ట‌న‌పై HBSE విచారణ చేప‌ట్టింది. అయితే ఈ లీక్ లో ప్ర‌మేయం ఉన్న మూడు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకుని పోలీసుల‌కు అప్పగించారు. మూడు మొబైల్ ఫోన్ ల‌లో హర్యానా బోర్డు కు సంబంధించిన 12వ త‌ర‌గ‌తి హిందీ పేప‌ర్ ఉంద‌ని తెలిపారు. ఇందులో ఒక మొబైల్ ఫోన్ ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడి ఫోన్‌తో క‌నెక్ట్ అయి ఉంద‌ని తెలిసింది. 

12వ హిందీ పేపర్‌ లీక్ అయిందన్న ఆరోపణల రావ‌డంతో మంధౌలి ప‌రిధిలో ఉన్న ఎగ్జామ్ సెంట‌ర్ల లో నిర్వ‌హించాల్సిన ప‌రీక్ష‌ల‌ను హర్యానా బోర్డు ర‌ద్దు చేసింది. ఈ పేపర్ లీక్ వ్య‌వ‌హారం వ‌ల్ల ఇప్పుడు ప‌రీక్ష‌ల‌న్నీ ప‌క్క‌నే ఉన్న బహ్ల్‌లో నిర్వ‌హిస్తామ‌ని అధికారులు తెలిపారు. అయితే పేప‌ర్ లీక్ అయిన ప్రాంతంలో త‌ప్పా.. మిగిలిన అన్ని జిల్లాల్లో షెడ్యూల్ ప్రకారం ప‌రీక్ష జ‌రిగింది. 

పరీక్ష రద్దు చేసిన మూడు కేంద్రాల ప‌రీక్ష నిర్వ‌హించేందుకు హర్యానా బోర్డు కొత్త తేదీలు త్వర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది. విద్యార్థులు ఏప్రిల్ 1వ తేదీన పంజాబీ భాషా పరీక్షకు హాజరవుతారు. తర్వాత ఏప్రిల్ 2వ తేదీన ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు హాజరవుతారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కూడా బుధ‌వారం బోర్డు 12వ త‌ర‌గతి ఇంగ్లీష్ పేప‌ర్ లీక్ అయిన రోజే ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న‌క‌రం. గురువారం మ‌ధ్యాహ్నం రెండో షిప్ట్ లో అక్క‌డి స్టూడెంట్ల‌కు ఆ రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు ఇంగ్లీష్ ప‌రీక్ష నిర్వ‌హించాల్సి ఉంది. అయితే పేప‌ర్ లీక్ కావ‌డంతో దాదాపు 24 జిల్లాల ప‌రిధిలో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు. దీనిపై కూడా అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.