ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర దేశాలతో దౌత్యపరంగా ఎలా వ్యవహరిస్తారనే దానిపై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పలు కీలక విషయాలు వెల్లడించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర దేశాలతో దౌత్యపరంగా ఎలా వ్యవహరిస్తారనే దానిపై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పలు కీలక విషయాలు వెల్లడించారు. భారత్- యూకే‌ల మధ్య జరిగే ప్రతి వాణిజ్య సంబంధిత సమావేశంలోనూ ప్రధాని మోదీ.. బ్యాంకులను వేల కోట్ల రూపాయలు ముంచేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను తిరిగి భారత్‌కు అప్పగించే అంశాన్ని లేవనెత్తారని చెప్పారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను యూకే తిరిగి భారత్‌కు అప్పగించేలా చేసేందుకు ప్రధాని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. 

ఈ మేరకు హరీష్ సాల్వే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్-యూకేల మధ్య జరిగిన వ్యాపార సమావేశంలో పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీల అప్పగింత అంశాన్ని ప్రధాని మోదీ లేవనెత్తారని చెప్పారు. ‘‘మేము సమావేశమైన క్షణం ప్రధాని మోదీ.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఎక్కడ ఉన్నారు? అని మొదటి ప్రశ్న అడుగుతారని యూకే అధికారులు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తారు. మీరు ఏకకాలంలో వ్యాపార భాగస్వామిగా, పారిపోయిన వ్యక్తులకు నిలయంగా ఉండకూడదని యూకే ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారు’’ అని హరీష్ సాల్వే పేర్కొన్నారు. 

ఇక, విజయ్ మాల్యా, నీరవ్ మోదీల అప్పగింతకు సంబంధించిన పెండింగ్ సమస్యపై యూకే ప్రభుత్వం భారతదేశం వైపు నుండి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని.. త్వరలోనే భారత్‌కు రప్పించనున్నారని హరీశ్ సాల్వే తెలిపారు.