కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం ఆ పార్టీ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది.

పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కీలక బాధ్యతల నుంచి వైదొలిగారు. అసోం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అసోంలోని 14 స్థానాలకు గాను.. కేవలం మూడింటిని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో హరీశ్ రావత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనికి తోడు పార్టీ ఘోర పరాజయానికి తానే బాధ్యుడినని పేర్కొంటూ.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

అంతేకాకుండా ఈ ఓటమికి చాలా మంది నైతిక బాధ్యత వహించాలంటూ రాహుల్ పార్టీ శ్రేణులకు నాలుగు పేజీల బహిరంగ లేఖను రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరీశ్ రావత్ అస్సాం ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.