Hardik Patel resigns: పాటిదార్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. అయితే గత కొద్దికాలంగా కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదంటూ ఆయన నిరసన గళం వినిపిస్తున్నారు.
gujarat congress: గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత గొడవల మధ్య పాటిదార్ నేత హార్దిక్ పటేల్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అతను తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ట్విట్టర్ లో రాజీనామా లేఖను పోస్టు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాష్ట్ర సమస్యలకు దూరంగా ఉన్నారని ఆరోపించారు. అలాగే, ఢిల్లీ నుండి వచ్చిన నాయకులకు చికెన్ శాండ్‌విచ్‌ను అందించడంపై ఎక్కువ దృష్టి సారించారు. వారి సమయం చికెన్ శాండ్‌విచ్‌ను పంపిణీ చేయడానికే సరిపోతుందంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌ను సరైన దిశలో నడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ పార్టీ నిరంతరం దేశ, సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ తన లేఖలో పేర్కొన్నారు.
పార్టీ సీనియర్ నాయకత్వానికి సీరియస్ నెస్ లేదని పాటిదార్ నేత హార్దీక్ పటేల్ ఆరోపించారు. "నేను సీనియర్ నాయకత్వాన్ని కలిసినప్పుడల్లా, గుజరాత్ ప్రజలకు సంబంధించిన సమస్యలను వినడానికి నాయకులు నిజంగా ఆసక్తి చూపరని నేను ఎప్పుడూ భావించాను, కానీ వారు తమ మొబైల్‌లో ఏ సందేశాలు అందుకున్నారనే దానిపై ఎక్కువ నిమగ్నమై ఉన్నారు..." అని పేర్కొన్నారు. గుజరాతీ ప్రజలు తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను వేయబోయే అడుగు భవిష్యత్తులో గుజరాతీలకు పాజిటివ్‌గా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గత నెలలో హార్ధీక్ పటేల్ తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్ పార్టీ గుర్తును తొలగించారు. దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ ను వీడుతారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత ఆయన ఈ విషయాలను కొట్టిపారేశారు.
కానీ.. ఇటీవల రాజస్థాన్ లోని ఉదయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శివిర్‌లో హార్దిక్ పటేల్ పాల్గొనలేదు. దీంతో ఆయన తప్పకుండా త్వరలోనే పార్టీ మారబోతున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక బుధవారం పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేస్తున్న ప్రకటించిన లేఖను సోనియాకు పంపారు. దీంతో ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేసిన హార్దిక్ పటేల్.. ‘‘నేను కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేయడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నా సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం ద్వారా భవిష్యత్తులో నేను గుజరాత్ కోసం నిజంగా సానుకూలంగా పని చేయగలనని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు.
