ఎన్నో మలుపులు, ఎత్తుగడలు, హైడ్రామా మధ్య నిర్భయ దోషులు అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ సహా మొత్తం నలుగురు నిందితులను శుక్రవారం ఉదయం తీహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే.

నిర్భయ హత్యాచార దోషులకు ఉరిశిక్ష అమలు కావడంతో ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారుల్లో ఒకరైన ఏసీపీ రాజేందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలు ద్వారా నేరగాళ్లు తప్పించుకోలేరంటూ సమాజానికి గట్టి సందేశం ఇచ్చినట్లయ్యిందన్నారు.

Also Read:నిర్భయ దోషులను ఉరి తీసిన తర్వాత తలారీ పవన్ స్పందన ఇదీ...

ఈ కేసులో ప్రజల నుంచి ఒత్తిడి రాకముందే.. దీనిలోని తీవ్రతను గుర్తించి తాము విచారణ చేపట్టామని రాజేందర్ తెలిపారు. ఈ కేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా వెనువెంటనే సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేపట్టి, సాక్షుల వాంగ్మూలాలు సేకరించామని ఆయన వెల్లడించారు.

హుటాహుటిన ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అదే రోజు రాత్రి విచారణ చేపట్టామని తొలుత ఓ పోలీస్ స్టేషన్‌కి చెందిన బృందం దీనిపై విచారణ జరిపిందని, ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసి మెరికల్లాంటి అధికారులకు దర్యాపతు బాధ్యతలను అప్పగించినట్లు రాజేందర్ పేర్కొన్నారు.

ఐదు నుంచి ఆరు వేర్వేరు పద్ధతుల ద్వారా నిందితులను గుర్తించామని పంటి గాట్లు, డీఎన్ఏ శాంపిళ్లను సేకరించి, సరిపోల్చి చూశామని ఆయన తెలిపారు. నిర్భయ ఘటన జరిగిన మార్గం మొత్తాన్ని డిజిటల్ రూపంలో తయారు చేశామని రాజేందర్ చెప్పారు.

నిందితులను అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే కాకుండా.. దర్యాప్తు జరుగుతున్నన్ని రోజులూ సంబంధిత పోలీసు అధికారులు అన్ని విధాలా అందుబాటులో ఉన్నారని నాటి సంఘటనను రాజేందర్ గుర్తుచేసుకున్నారు.

Also Read:నిర్భయ కేసు: ఎప్పుడు ఏం జరిగిందంటే?

బాధితులు, సాక్షులు తమ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తాము జాగ్రత్త పడ్డామని, దర్యాప్తు జరిగిన విధానానికి కోర్టు సైతం ప్రశంసలు కురిపించిందని రాజేందర్ తెలిపారు. నిర్భయ కేసు స్టడీని ఢిల్లీ పోలీస్ శిక్షణా కేంద్రాల్లో కూడా బోధిస్తున్నారని రాజేందర్ సింగ్ చెప్పారు.

అత్యాచార ఘటన తర్వాత నిర్భయ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆమె కుటుంబ సభ్యుల బాధ చూసి అధికారులు చలించిపోయారని ఆయన ఉద్వేగంగా చెప్పారు. మా అధికారులు వారి కుటుంబంలో ఒకరిగా మారిపోయారని, ఆ బంధంతోనే కేసును వేగవంతంగా దర్యాప్తు చేయడానికి ప్రేరేపించిందని రాజేందర్ పేర్కొన్నారు.