ఢిల్లీలో ఒకే ఇంట్లో 11 మంది మృతి: వెలుగులోకి భయంకర వాస్తవాలు

Handwritten notes with horrific details show occult link in Delhi family deaths
Highlights

ఢిల్లీలోని బురారీలో ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి కేసులో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీలో ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి కేసులో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. ఢిల్లీలో ఒకే ఇంట్లో 11 మంది మృతదేహాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. 

ఆత్మసంబంధమైన, మార్మికమైన విషయాల ప్రేరణ వారి మృతి వెనక ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు టీనేజర్లు రెండతస్థుల ఇంటిలోని మొదటి అంతస్థులో సీలింగ్ కు ఉరి వేసుకుని ఆదివారం కనిపించారు.  

మృతుల కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. కొందరి చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. మరో వృద్ధురాలు ఢిల్లీలోని సంత్ నగర్ ప్రాంతంలో గల మరో గదిలో మరణించింది.

ఈ మరణాలకు సంబంధించి పోలీసులకు రెండు రిజిస్టర్లు దొరికాయి. వాటిలో చేతిరాతతో మోక్షం ఎలా పొందాలనే విషయాలు రాసి ఉన్నాయి. కాళ్లను, చేతులను ఎలా కట్టేయాలో వాటిలో రాసి ఉందని, అందులో రాసిన విధంగా శవాల కాళ్లూ చేతులూ కట్టేసి ఉన్నాయని పోలీసులు అంటున్నారు. 

వాటిలో ఇంకా చాలా రాసి ఉందని, వాటిని చదువుతున్నామని వారు చెబుతున్నారు. డైరీలో రాసి చేతి రాత ఎవరిదనే విషయాన్ని కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయాలు ఎందుకు రాశారు, ఆ సమాచారం ఎక్కడిదనే ఆరా కూడా తీస్తున్నారు. 

కుటుంబానికి సంబంధించిన ఓ వ్యక్తిని ప్రశ్నించడానికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని కూడా తనిఖీ చేస్తున్నారు. 

మానవ శరీరం అశాశ్వతమైంది, కళ్లనూ నోటినీ మూసుకోవడం ద్వారా భయాన్ని పారద్రోల వచ్చునని నోట్స్ లో ఉంది. ఈ ఆచారాన్ని పాటిస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయని, మోక్షం లభిస్తుందని దర్యాప్తులో తేలడానికి ఆ నోట్స్ క్లూ ఇచ్చాయని భావిస్తున్నారు. 

కొన్ని నోట్స్ కు తేదీలు కూడా వేసి ఉన్నాయి. అన్ని నోట్స్ లోనూ శాంతిని సాధించడం ఎలా అనే విషయాలు రాసి ఉన్నాయి. దాంతో పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. 

loader