నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాలో ప్రస్తుత నాయకత్వం మార్పులు చేసింది. ఆ జెండాపై ఉండే సుత్తె, కొడవలి గుర్తును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సుత్తె కొడవలి పార్టీని ఒక సోషలిస్టు పార్టీగా గుర్తింపు సాధించడంలో అవరోధాలు సృష్టించడమే కాదు.. దీన్ని కమ్యూనిజంగా ప్రతిబింబించే ముప్పు ఉన్నదని పేర్కొంది. 

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాలో మార్పులు చేశారు. ఆ పార్టీ జెండాలో నుంచి సుత్తె, కొడవలి గుర్తును తొలగిస్తూ ప్రస్తుత పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. దూకుతున్న పులి బొమ్మను ఎప్పట్లాగే కొనసాగిస్తున్నా.. సుత్తె, కొడవలి గుర్తును మాత్రం తొలగించాలని నిర్ణయించింది. సుభాష్ చంద్రబోస్ భావజాలాన్ని నొక్కి చెప్పడానికి, అలాగే, కమ్యూనిజం నుంచి కొంత డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రెండు రోజులు ఏఐఎఫ్‌బీ జాతీయ మండలి సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు రోజుల సదస్సు ఒడిశాలోని భువనేశ్వర్‌లో శనివారం ముగిసింది.

ఈ నిర్ణయం పై సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్ర కుమార్ బోస్ స్పందించారు. ఏఐఎఫ్‌బీ దాని ప్రస్తుత జెండాను మార్చాలని పేర్కొన్నారు. దాని వరిజినల్ వర్షన్ అయినా.. త్రివర్ణ పతాకంపై దూకుతున్న పులి బొమ్మ గుర్తును ఎంచుకోవాలని వివరించారు. పురోగతి కోసం అన్ని వర్గాల ఐక్యత వంటి నేతాజీ ఏకీకరణ భావజాలాన్ని తప్పక బోధించాలని తెలిపారు. దేశాన్ని విభజిస్తున్న మతపరమైన ఉన్మాదంపై పోరాడటానికి ఆయన భావజాలాన్ని తప్పక వినియోగించుకోవాలని వివరించారు.

1948లో పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో పాత జెండా గుర్తును ఎంచుకున్నారు. ఎరుపు రంగుపై దూకుతున్న పులిని, దానితోపాటు సుత్తె, కొడవలిని ఆ జెండాపై ఎంచుకున్నారు.

జెండా మార్చడానికి గల కారణాలు:
ఈ వారం జరిగిన ఏఐఎఫ్‌బీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో నాయకత్వం పార్టీ జెండాను మార్చాలనే నిర్ణయం తీసుకుంది. సుత్తె, కొడవలి గుర్తులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ అనే భావనలోకి తీసుకెళ్లుతున్నాయని, దాని సోషలిస్టు పార్టీ గుర్తింపును ఈ గుర్తు డామినెంట్ చేస్తున్నదని నాయకత్వం పేర్కొంది. ఇది ఒక దుష్ప్రచారంగా మారింది. దీని కారణంగానే ఏఐఎఫ్‌బీ ఒక స్వతంత్ర సోషలిస్టు పార్టీగా ఎదగకుండా అవరోధాలు సృష్టించిందని నాయకత్వం పేర్కొంది.

అదే సందర్భంలో కార్మికవర్గం స్వభావం, పరిమాణాల్లో అనేక మార్పులు వచ్చాయని పార్టీ కౌన్సిల్ భావించింది. ఎందుకంటే ఇప్పడు కార్మికవర్గం ఎక్కువగా సేవారంగంలో ఉన్నదని వివరించింది. సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా సేవా రంగమే ఎక్కువ జీడీపీని అందిస్తున్నదని, వ్యవసాయం, పారిశ్రామిక రంగం కంటే కూడా సేవా రంగం ద్వారానే దేశ జీడీపీకి ఎక్కువ లబ్ది చేకూరుతున్నదని తెలిపింది. అలాగే, అన్ని వర్గాల కార్మికులను ప్రతిబింబించే గుర్తులను పార్టీ జెండాపై వేయడం సాధ్యం కాదని ఓ ప్రకటనలో ఏఐఎఫ్‌బీ పార్టీ కౌన్సిల్ ప్రకటించింది.