బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు హిందుస్తాని ఆవామ్ మోర్చా వెల్లడించింది. హెచ్ఏఎంను జేడీయూలో విలీనం చేయాలని ఒత్తిడి చేసినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెచ్ఏఎం పేర్కొంది. 

బిహార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ ప్రభుత్వానికి హిందుస్తాని ఆవామ్ మోర్చా సోమవారం మద్దతు ఉపసంహరించుకుంది. జితన్ రామ్ మాంఝీ కొడుకు, హెచ్ఏఎం జాతీయ అధ్యక్షుడు సంతోష్ సుమన్ బిహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టు వివరించారు. నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు లెటర్ ఇవ్వనున్నట్టు తెలిపారు.

నితీశ్ క్యాబినెట్ నుంచి సుమన్ గతవారం రాజీనామా చేశారు. హెచ్ఏఎం పార్టీని జేడీయూలో విలీనం చేయాలని నితీశ్ కుమార్ ఒత్తిడి చేశాడని, అందుకే మద్దతు ఉపసంహరించే నిర్ణయం తీసుకున్నట్టు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. 

భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడానికి హెచ్ఏఎం జాతీయ కార్యవర్గం తనకు అధికారాన్ని ఇచ్చిందని వివరించారు. తదుపరి అవకాశాల అన్వేషణ కోసం తాను ఢిల్లీ పర్యటన చేయబోతున్నట్టు తెలిపారు. ఎన్‌డీఏ నుంచి బీజేపీ ఆహ్వానం ఇస్తే దాన్ని పరిగణించి అందులో చేరడానికి తాము సిద్ధం అని చెప్పారు.

అలాగే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో చేరడానికి తాము ఆప్షన్ ఓపెన్‌గా ఉంచామని సుమన్ తెలిపారు. హెచ్ఏఎం పార్టీ 8 ఏళ్ల క్రితం ఆవిర్భవించింది. అప్పటి నుంచి చాలా సార్లు చాలా పార్టీలతో జతకట్టింది. విడిపోయింది. 

Also Read: ప్రతిపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు?.. బీజేపీ ప్రశ్నలకు విపక్షాల సమాధానం ఇదే

సుమన్‌కు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకి షెడ్యూల్ ఖరారైందన్న వార్తలను ధ్రువీకరించాలని కోరగా.. ఆ పార్టీ స్పందించడం లేదు.

జేడీయూను ముక్కలు చేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని నితీశ్ కుమార్ సంచలన ఆరోపణలు చేసి ఎన్‌డీఏ నుంచి తప్పుకుని గతేడాది మహా ఘట్ బంధన్‌లో చేరారు. నితీశ్ కుమార్‌కు సంఘీభావంగా హెచ్ఏఎం నలుగురు ఎమ్మెల్యేలతో ఈ కూటమిలో చేరింది.

243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బిహార్‌లో అధికార కూటమికి 160 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ అధికార కూటమిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. మూడు లెఫ్ట్ పార్టీలూ బయటి నుంచి జేడీయూకు మద్దతు పలుకు తున్నాయి.