Gyanvapi Masjid Row: జ్ఞానవాపి మసీదు సముదాయం సర్వేపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై  మే 17న (మంగ‌ళ‌వారం)  సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ పిటిషన్‌ను దాఖ‌లు చేసింది.  

Gyanvapi Mosque: వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు సముదాయం సర్వేపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మే 17, మంగ‌ళ‌వారం విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ ఈ పిటిష‌న్ ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిష‌న్‌ను విచారించనుంది. గతవారం ప్రారంభంలో, జ్ఞానవాపి మసీదు సర్వేను తక్షణమే నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా పిటిషన్‌ను జాబితా చేయడానికి అంగీకరించింది.

జ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించిన తాజా వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

1. జ్ఞానవాపి మసీదు సముదాయంలో వరుసగా మూడో రోజు నిర్వహించిన కోర్టు ఆదేశిత వీడియోగ్రఫీ సర్వే సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ముగిసింది.

2. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మసీదు సముదాయం సర్వే సుమారు 10:15 గంటలకు ముగిసింది.

3. జ్ఞానవాపి మసీదు సముదాయం వీడియోగ్రఫీ సర్వే పూర్తయినందున, హిందూ వ‌ర్గానికి చెందిన న్యాయవాదులు బావిలో 'శివలింగం' కనుగొనబడిందని పేర్కొన్నారు.

4. జ్ఞానవాపి మ‌సీదులో క‌నుగొన‌బ‌డిన శివ‌లింగం రక్షణ కోసం సివిల్ కోర్టును ఆశ్రయిస్తానని లాయర్ విష్ణు జైన్ తెలిపారు.

5. గత వారం జ్ఞానవాపి మసీదు కమిటీ అభ్యంతరాల మధ్య సర్వే నిలిచిపోయింది. సర్వే కోసం కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్‌కు ఆవరణలో చిత్రీకరించే ఆదేశం లేదని పేర్కొంది.

6. జ్ఞానవాపి-గౌరీ శృంగార్ కాంప్లెక్స్‌ను సర్వే చేయడానికి న్యాయస్థానం న్యాయవాది కమిషనర్‌గా నియమించిన అజయ్‌కుమార్ మిశ్రాను భర్తీ చేయాలని మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిని జిల్లా సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవికుమార్ దివాకర్ గురువారం తన ఉత్తర్వులో తిరస్కరించారు.

7. ఈ సర్వేలో కోర్టు కమిషనర్‌కు సహకరించేందుకు మరో ఇద్దరు న్యాయవాదులను నియమించామని, మంగళవారం నాటికి పూర్తి చేయాలని చెప్పారు.

8. సర్వే కోసం కాంప్లెక్స్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు తాళాలు ఉంటే వాటిని పగలగొట్టాలని జిల్లా కోర్టు పేర్కొంది. సర్వేకు అనుమతి లేకుంటే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని జిల్లా అధికారులను కూడా కోరింది.

9. మసీదు కాంప్లెక్స్‌లో హిందూ ప్రార్థనా చిహ్నాలు ఉన్నాయన్న ఆరోపణల వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నారు.

10. ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు - రాఖీ సింగ్, లక్ష్మీ దేవి, సీతా సాహు మరియు ఇతరులు ఏప్రిల్ 18, 2021న‌ కోర్టును ఆశ్రయించారు. జ్ఞానవాపి మ‌సీదు వెలుపలి గోడలపై ఉన్న హిందూ దేవతల విగ్రహాల ముందు రోజువారీ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరారు. విగ్రహాలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యర్థులు అడ్డుకోవాలని కూడా విజ్ఞ‌ప్తి చేశారు. 

Scroll to load tweet…