ఇద్దరు మహిళల్ని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి విషయంలో గ్వాలియర్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు వైరల్ గా మారింది. వారంలో చెరో మూడు రోజులు.. ఇద్దరి దగ్గరా గడపాలని.. ఆదివారం నీ ఇష్టం అంటూ తీర్పు ఇచ్చింది.
మధ్యప్రదేశ్ : ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు ఒకరు కోర్టుకు ఎక్కాడు. ఆ ఇద్దరు భార్యలు నాతో ఉండాలి అంటే.. నాతో ఉండాలి అంటూ.. భర్తతో గొడవకు దిగడంతో ఈ కేసు కోర్టు వరకు వచ్చింది. అయితే మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు భార్యలకు సరి సమానంగా న్యాయం చేస్తూ.. ఏ భార్యకూ ఇబ్బంది కలగకుండా.. వారంలో ఒక భార్యతో మూడు రోజులు.. మరో భార్యతో మూడు రోజులు.. ఉండాలని తీర్పునిచ్చింది. వారంలో మొత్తం ఏడు రోజులు కదా మరి మరో రోజు మాటేమిటి అంటారా?..
ఆ విషయంలోనూ ఓ స్పష్టతనిచ్చింది కోర్టు.. మూడు రోజులు ఒకరితో.. మూడు రోజులు మరొకరితో.. ఆదివారం నాడు అతని ఇష్టం మేరకు ఎక్కడైనా ఉండొచ్చని తీర్పునిచ్చింది ఫ్యామిలీ కోర్టు. ఈ విచిత్రమైన కేసు వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని ఓ ఫ్యామిలీ కోర్టు ఈ మేరకు తీర్పును ఇచ్చింది. ఓ వ్యక్తి మొదటి భార్యకు తెలియకుండా.. రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు విషయం తెలిసి కోర్టుకు ఎక్కింది. ఆ రెండో భార్య కూడా తనకు అతనే కావాలని కూర్చుంది.. దీంతో కేసును పరిశీలించిన కోర్టు సదరు భర్తను మూడు రోజులు ఒక భార్య దగ్గర, మరో మూడు రోజులు మరో భార్య దగ్గర గడపాలని.. మిగిలిన ఒక ఆదివారం ఆ భర్త ఏ భార్య దగ్గర ఉండాలని కోరుకుంటే ఆ భార్య దగ్గర ఉండొచ్చని తీర్పునిచ్చింది.
రాహుల్ గాంధీపై హేమా మాలిని ఫైర్.. అసలేం జరిగింది?
ఈ మేరకు ఆ ముగ్గురితో ఒక ఒప్పందానికి కూడా కుదిరించింది. ఈ ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు హర్యానాలోని మల్టీ నేషనల్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. గ్వాలియర్ నివాసి. 2018లో గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కరోనా సమయంలో 2020లో లాక్ డౌన్ విధించిన సమయంలో.. భార్యను పుట్టింటికి పంపించాడు. అయితే, ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా కూడా భార్యను తీసుకురాలేదు. తను ఒక్కడే హర్యానాకు వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న మరో మహిళతో ప్రేమలో పడి.. రెండో వివాహం చేసుకున్నాడు.
రోజులు గడుస్తున్నా భర్త నుండి ఎలాంటి సమాధానం లేకపోవడం.. వచ్చి తీసుకువెళ్లే ఊసే లేకపోవడంతో భార్యనే స్వయంగా హర్యానాకు వెళ్ళింది. అక్కడికి వెళ్లాక కానీ ఆ భార్యకు తన భర్త రెండో వివాహం చేసుకున్నాడు అన్న విషయం తెలియలేదు. దీంతో తిరిగి గ్వాలియర్ కు వచ్చేసి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఫ్యామిలీ కోర్టు భర్తను, రెండో భార్యను కూడా పిలిపించి ఆరు నెలలపాటు కౌన్సిలింగ్ నిర్వహించింది. ముగ్గురితోను కౌన్సిలర్ హరీష్ దివాన్ చర్చలు జరిపాడు. ఆ ముగ్గురి మధ్య సయోధ్య కుదిరించారు. కోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని భార్యలు అంగీకరించారు. ఫ్యామిలీ కోర్టు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ భర్త.. భార్యలు ఇద్దరికీ చెరో ప్లాట్ కొనిచ్చాడు.
