గురుగ్రామ్ : ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ప్రాణాలు పోతున్న సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి పూజలు చేస్తే బతుకుతాడని చెప్పడంతో గుడికి తీసుకెళ్లిన ఘటన గురుగ్రామ్ నగరంలో చోటు చేసుకుంది. 

ఆపస్మారక స్థితిలో ఉన్న ఆయువకుడు గుడిలోనే కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే గురుగ్రామ్ నగరానికి చెందిన జీవరాజ్ రాథోడ్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈనెల 13న తన ఇంటికి సమీపంలో ఉన్న చెరువు వద్ద విషం తాగి పడిపోయాడు. 

విషం తాగిన జీవరాజ్ రాథోడ్ ను కుటుంబ సభ్యులు గమనించారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జీవరాజ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా మూఢనమ్మకంతో గుడికి తీసుకెళ్లి పూజలు చేశారు. జీవరాజ్ బతుకుతాడని అతని కుటుంబ సభ్యులు పూజలు చేయడం మెుదలుపెట్టారు. 

అంతేకాదు పూజలు చేస్తూనే జీవరాజ్ చేత తీర్థం పేరిట బలవంతంగా మంచినీళ్లు తాగించారు. దీంతో జీవరాజ్ ఆరోగ్యం క్షిణించడంతో రెండు రోజుల తర్వాత అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జీవరాజ్ మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. మూఢనమ్మకాలకు నిండు ప్రాణం బలికావడంతో ఆ ప్రాంతమంతా విషాదం చోటు చేసుకుంది.