Asianet News TeluguAsianet News Telugu

అమానవీయం: సాయం చేసిన సెక్యూరిటీ గార్డుపై దాడి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

గురుగ్రామ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో నుంచి బయటకు తీసుకురావడానికి సహకరించిన సెక్యూరిటీ గార్డుపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. పదే పదే సెక్యూరిటీ గార్డును కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Gurgaon Man Arrested for Slapping security Guards After Being Stuck in Lift
Author
First Published Aug 30, 2022, 12:33 PM IST

గురుగ్రామ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో నుంచి బయటకు తీసుకురావడానికి సహకరించిన సెక్యూరిటీ గార్డుపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. పదే పదే సెక్యూరిటీ గార్డును కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో గురుగ్రామ్‌లోని సెక్టార్ 50లోని క్లోజ్ నార్త్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. క్లోజ్ నార్త్ సొసైటీకి చెందిన వరుణ్ నాథ్ 14వ అంతస్తు నుంచి లిఫ్ట్ నుంచి కిందకు వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో అతడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. సహాయం కోసం అతను లిఫ్ట్‌లో అమర్చిన ఇంటర్‌కామ్ ద్వారా సెక్యూరిటీ గార్డు అశోక్‌కు సమాచారం ఇచ్చాడు. 

అశోక్ తనతోపాటు లిఫ్ట్‌మ్యాన్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. వరుణ్‌ని లిఫ్ట్‌లో నుంచి బయటకు తీసుకురావడానికి సుమారుగా ఐదు నిమిషాలు పట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు లిఫ్ట్ నుంచి బయటకు రాగానే సెక్యూరిటీ గార్డును కొట్టడం ప్రారంభించాడు. తిట్టడం కూడా చేశాడు. అక్కడే మరో వ్యక్తిపై కూడా చేయి చేసుకున్నాడు.  ‘‘నేను వరుణ్‌‌ను 3-4 నిమిషాల్లో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు సహాయం చేశారు. అతను బయటకు వచ్చిన వెంటనే.. నన్ను కొట్టడం ప్రారంభించాడు’’ అని అశోక్ కుమార్ చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.  వరుణ్ అంతటితో ఆగకుండా.. కుమార్‌, లిఫ్ట్ ఆపరేటర్‌లపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం పోలీసులు వరుణ్‌ను అరెస్ట్ చేసిన పీటీఐ రిపోర్ట్ చేసింది. 

ఈ ఘటనపై సెక్యూరిటీ గార్డులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ సొసైటీ గేటు వద్ద సెక్యూరిటీ గార్డులు గుమిగూడి నిరసన తెలిపారు. హౌసింగ్ సొసైటీ వాసులకు సేవలను అందించేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడుతున్నామని సొసైటీ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. అయితే కొంతమంది సొసైటీ వాసులు మాత్రం తమను బానిసలుగా భావిస్తున్నారని చెప్పారు. నిందితుడు వరుణ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. ఇక, ఈ ఘటనపై కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్లు 323, 506 కింద నిందితుడు వరుణ్‌నాథ్‌పై కేసు నమోదు చేశారు. 

 

పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన వ్యక్తిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది దీనిని అమానవీయ ఘటన అని పేర్కొన్నారు. 

ఇక, ఇటీవల నోయిడా మహిళ.. హౌసింగ్ సొసైటీకి చెందిన సెక్యూరిటీ గార్డులను దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios