అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లు పోలీసు కస్టడీలో ఉండగానే ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు వారిపై సమీపం నుంచి ఫైరింగ్ జరిపారు. అతీక్ అహ్మద్, ఆ తర్వాత క్షణాల్లోనే అష్రఫ్ అహ్మద్ పై కాల్పులు జరిగాయి. లైవ్‌లో మీడియాతో వారు మాట్లాడుతుండగానే ఈ ఫైరింగ్ జరగడంతో ఘటన వీడియో రికార్డు అయింది. హంతకులూ మీడియా  ప్రతినిధులుగా మారువేషంలో ఉన్నట్టు తెలిసింది. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ పై శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. క్షణాల్లోనే పక్కనే ఉన్న అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ పైనా ఫైరింగ్ జరిగింది. మీడియాతో మాట్లాడుతుండగానే వారిపై ఈ కాల్పులు జరిగాయి. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే వారిద్దరూ నేలకూలారు. స్పాట్‌లోనే మరణించారు. ధూమన్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో వారిద్దరూ పోలీసు కస్టడీలో ఉండగానే ఈ ఘటన జరిగింది.

మెడికల్ టెస్టుల కోసం ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వారిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లుతున్నారు. వారు పోలీసు వ్యాన్ దిగగానే మీడియా ప్రతినిధులు వారి ముందుకు వచ్చారు. కొడుకు అంతిమ సంస్కారాలకు హాజరుకాకపోవడంపై ఆయనను ప్రశ్నించారు. వారిద్దరూ మీడియా ప్రతినిధులకు సమాధానం ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. అదే సమయంలో వారిపై ఫైరింగ్ జరిగింది.

అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ పై ఇద్దరు లేదా ముగ్గురు కాల్పులు జరిపారు. వారిపై కాల్పులు జరిపిన హంతకులూ మీడియా ప్రతినిధులుగా మారువేషంలో ఉన్నట్టు సమాచారం. అతి సమీపం నుంచే వారిపై కాల్పులు జరిపారు. లైవ్ టెలికాస్ట్‌లో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న సమయంలో వారిపై కాల్పులు జరగడంతో ఈ ఘటన మొత్తం వీడియో రికార్డ్ అయింది.

Also Read: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ హతం.. మీడియాతో లైవ్‌లో మాట్లాడుతుండగానే ఫైరింగ్(video)

కాల్పులు జరిపిన అందరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలను రికవరీ చేసుకున్నారు. నిందితులు లవ్‌లెష్ తివారీ, సన్నీ, అరున్ మౌర్యలుగా గుర్తించారు. వీరు ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారు. వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల మృతదేహాలు ఎస్ఆర్ఎన్ హాస్పిటల్‌కు తరలించారు. వీరిపై కాల్పులకు తెగబడ్డ వారి మోటర్ సైకిల్‌నూ రికవరీ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో స్పెషల్ డీజీ (లా అండ్ ఆర్డర్) సహా సీనియర్ పోలీసు అధికారులకు సీఎం యోగి ఆదిత్యానాథ్ కార్యాలయం సమన్లు పంపింది. సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.