గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం కేబుల్ వంతెన కూలిన ఘటనలో 132 మంది మరణించారు.
గుజరాత్ : గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలిన ప్రమాదంలో 130 మందికి పైగా మరణించారు. దీనిమీద గుజరాత్ సమాచార శాఖ స్పందిస్తూ... చనిపోయిన వారు కాక.. సుమారు 177 మందిని రక్షించారని, 19 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. అంతేకాదు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDRF, అగ్నిమాపక దళాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని తెలిపింది.
మచ్చు నదిలో పడిన వారిని రక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)కు చెందిన ఐదు బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. "రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భారత సైన్యం రాత్రి 3 గంటలకు ఇక్కడకు చేరుకుంది. మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయి" అని భారత సైన్యం మేజర్ గౌరవ్ తెలిపారు.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం అత్యవసరంగా బృందాలను పంపాలని ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్ బృందాలు నదిలో పడిపోయినవారి మృతదేహాలను బయటికి తీశారు. వాటిని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మోర్బి సివిల్ ఆసుపత్రికి తరలించారు.
ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేదు..ప్రభుత్వ అనుమతి లేదు.. అయినా సందర్శకులను ఎలా అనుమతించారు?
ఘటన జరిగిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మోర్బీకి చేరుకుని సహాయక చర్యలు, వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. సహాయక చర్యలు ముగిసే వరకు ముఖ్యమంత్రి మోర్బీలో క్యాంపు ఉండే అవకాశం ఉంది.
మోర్బిలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని కూడా ప్రధాని మోడీ ప్రకటించారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి కూడా మోర్బీలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని.. ఈరోజు రేంజ్ ఐజీపీ నేతృత్వంలో విచారణ ప్రారంభించామని తెలిపారు.
క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో చాలా మందిని చికిత్స అనంతరం వారి ఇళ్లకు కూడా పంపించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. "గాయపడినవారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మంది చికిత్స తర్వాత వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఇంకా మరణించిన లేదా గాయపడిన వారికోసం వెతుకులాట, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. నది నుండి మృతదేహాలను బయటకు తీసే పని ఇంకా కొనసాగుతోంది" అని పటేల్ చెప్పారు.
కాగా, గుజరాత్, రాజస్థాన్‌లలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, మోర్బీ కేబుల్ వంతెన కూలిన ఘటన నేపథ్యంలో సోమవారం అహ్మదాబాద్‌లో జరగాల్సిన రోడ్‌షోను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. మోర్బీ వంతెన వందేళ్ల పురాతనమైనది దీన్ని ఐదు రోజుల క్రితమే.. విస్తృత మరమ్మతులు, పునరుద్ధరణల తర్వాత తిరిగి తెరిచారు. ఈ వంతెన ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కూలిపోయింది. ఆ సమయంలో వంతెన మీద జనం కిక్కిరిసి ఉన్నారు.
