ముగ్గురు కూతుళ్లను చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన గుజరాత్ రాష్ట్రం మహిసాగర్ జిల్లాలోని కడానా తాలుకాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.... 

కడానా తాలుకాకి చెందిన మంగు డామోర్(27)కి ఏడు సంవత్సరాల క్రితం రమణ్ అనే వ్యక్తితో వివాహమయ్యింది. వీరికి ముగ్గురు సంతానం. షర్మిష్ట(5), సుర(3), భూరి(1) ముగ్గురు ఆడపిల్లలే కావడం గమనార్హం. కాగా...గత కొద్ది రోజులుగా  మంగు ఇంట్లో ముభావంగా ఉంటోంది. కనీసం ఇంట్లో వంట కూడా చేయకుండా ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటోంది. కనీసం పిల్లలు ఆకలౌతోందని అన్నం పెట్టమని అడిగినా కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.

Also read ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నవ వధువుకి 10గ్రాముల బంగారం కానుక...

చిన్న కుమార్తె ఆకలి తట్టుకోలేక ఏడుస్తుంటే.. రమణ తల్లి భోజనం వండి పిల్లలకు పెట్టింది. కాగా... బుధవారం సాయంత్రం 8గంటల నుంచి మంగు, ఆమె ముగ్గురు పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. కాగా... గురువారం ఉదయం వారి ఇంటికి సమీపంలో ఉన్న ఓ బావి వద్ద మంగు, పిల్లలకు సంబంధించిన కొన్ని వస్తువులు లభించాయి.

రమణ బంధువు వాటిని గుర్తించి బావిలోకి చూడగా... ముగ్గురు చిన్నారులు శవాలై తేలి కనపడ్డారు. వెంటనే ఈ విషయాన్ని సదరు వ్యక్తి రమణకు తెలియజేశాడు. అతను వెళ్లి చూడగా.. పిల్లలు చనిపోయి కనిపించారు. స్థానికుల సహాయంతో చిన్నారుల శవాలను వెలికి తీశారు. కాగా.. బావిలోని కొన్ని నీటిని బయటకు పారబోసిన తర్వాత మంగు మృతదేహం బయటపడింది.

అయితే... ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది.. చిన్నారులకు ఎందుకు చంపింది అన్న విషయం మాత్రం తెలియరాలేదు. కొడుకు లేడనే బాధ మంగులో ఎప్పుడూ ఉండేదని, ముగ్గురు ఆడపిల్లలే పుట్టడంతో మనస్థాపానికి గురైందని ఆమె భర్త రమణ చెప్పాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.