ప్రతి పెళ్లి కుమార్తెకు పది గ్రాముల బంగారం ఉచితంగా ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆఫర్ ఇచ్చింది మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం కాదు.. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం బంగారం ధర ఎక్కువగా ఉండటంతో... చాలా మంది పేదలు కనీసం పెళ్లికి కూడా బంగారం కొనుగోలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

ఈ నేపథ్యంలో తులం బంగారం అందించడానికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సదరు పెళ్లి కూతురు తులం బంగారం కొనుగోలు చేసుకునే విధంగా రూ.30వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  అయితే... కనీసం ఆ వధువు పదో తరగతి వరకు చదువుకొని ఉండాలని.. వధూవరులకు ఇద్దరూ కనీస వివాహ వయసుకు వచ్చి ఉండాలనే షరతు విధించారు. 

దీనికి అరుంధతి బంగారు పథకం అనే పేరును పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. బాల్య వివాహాలను అరికట్టడం, బాలికా విద్యు ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

పెళ్లి వయసు వచ్చి, వివాహాన్ని నమోదు చేయించుకున్న ప్రతి పెళ్లి కూతురికి తులం బంగారం కానుకగా ఇచ్చే ఉద్దేశంతో రూ.30వేలు అందిస్తున్నామని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. ఈ పథకం వల్ల తమ ప్రభుత్వంపై రూ.800కోట్ల భారం పడనుందని ఆయన చెప్పారు. 

తాము ఈ పథకం ఓట్ల కోసం చేయడం లేదని చెప్పారు. అస్సాంలో ప్రతి సంవత్సరం 3లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని చెప్పారు. కానీ.. 50నుంచి 60వేల పెళ్లిళ్లు మాత్రమే నమోదౌతున్నాయని చెప్పారు. ఈ పథకం అమల్లోకి వస్తే 2.5లక్షల పెళ్లిళ్లు నమోదౌతాయని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు.