భర్త మూడు సార్లు తలాక్ చెప్పాడనే ఆవేధనతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. కాగా.. త్రిపుల్ తలాక్ నిషేధ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఆత్మహత్యకు యత్నించిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... ట్రిపుల్ తలాక్ చెప్పిన.. భర్త, అతని కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం.  ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరమని.. దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

2017లో ముమ్మారు తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నాటి నుంచి ప్రత్యేక చట్టం తేవాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఎట్టకేలకు ట్రిపుల్‌ తలాక్‌ నిషేద బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలపడంతో ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్‌ స్థానంలో ఇది చట్ట రూపం దాల్చనుంది. లోక్‌సభ గతవారం ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఎగువసభ ఆమోదం సాధ్యమైంది.