Gujarat: గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Heavy Rain In Gujarat: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాలను నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణ గుజరాత్ & సౌరాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణనష్టం క్రమంగా పెరుగుతోంది. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాలలో గత 24 గంటల్లో చాలా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షం, వరదల కారణంగా 14 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు 31,000 మందికి పైగా ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు బుధవారం నాడు మీడియాకు తెలిపారు.
వర్షాల కారణంగా కచ్, నవ్సారి, డాంగ్ జిల్లాల్లో మూడు జాతీయ రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. 51 రాష్ట్ర రహదారులు, 400కు పైగా పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి రాజేంద్ర త్రివేది మీడియాతో అన్నారు.
పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య బుధవారం అహ్మదాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. రోడ్లు మునిగిపోవడం, నివాస ప్రాంగణాలను వర్షపు నీరు ముంచెత్తడంతో, నవ్సారి జిల్లాలో వరద పరిస్థితి భయంకరంగా మారింది.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎనిమిది మంది చనిపోయారు. నవ్‌సారి, వల్సాద్, డాంగ్, నర్మదా, ఛోటా ఉదేపూర్, పంచమహల్ వంటి ఆరు అత్యంత ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. రాజ్‌కోట్‌లో భారీ వర్షం కారణంగా వరదలు వంటి పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇప్పటికే పరిస్థితి దారుణంగా మారగా.. రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. "చురుకైన రుతుపవన ద్రోణి ఉగ్రత, ఇప్పుడు గుజరాత్ నుండి కర్నాటక తీరం వరకు ప్రవహిస్తున్న ఆఫ్‌షోర్ ద్రోణి, రాబోయే 4-5 రోజుల పాటు రాష్ట్రంలో స్థానికీకరించిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలి. గుజరాత్‌లో గురువారం (జూలై 14) వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత శుక్రవారం నుంచి శనివారం (జూలై 15-16) వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది" అని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
