వివాహేతర సంబంధం.. ఆమెతో పారిపోయిన బావను బావమర్దులు రప్పించి, పోల్‌కు కట్టేసి.. ఆ నలుగురిపై కేసు ఫైల్
సోదరి, బావకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత బావ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా ఆ వ్యవహారం నడిపించి మే నెలలో ఇద్దరూ కలిసి పారిపోయారు. దీంతో బావను తిరిగి రప్పించి వారిద్దరినీ పోల్‌కు కట్టేసి చితకబాదారు. గుజరాత్ పోలీసు కేసు నమోదు చేసుకుని ఆ నలుగురిని అరెస్టు చేశారు.

అహ్మదాబాద్: ఆ వ్యక్తికి పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా. వారి బాగు చూసుకోవాల్సిన బాధ్యత మరిచి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో పాటు మరో చోటికి పారిపోయాడు. ఆ వ్యక్తి భార్య మాత్రం పిల్లలతోపాటు ఉంది. తన సోదరులకు విషయం తెలిపింది. వారు రంగంలోకి దిగారు. చివరకు బావను రప్పించారు. పారిపోయిన ఇద్దరినీ కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత వారిద్దరినీ దాడి చేసిన నలుగురిపైనా కేసు నమోదైంది. ఈ ఘటన గుజరాత్ పంచమహల్ జిల్లాలో మోర్వా హదాఫ్ తాలూకా పరబియ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
27 ఏళ్ల ఆశిశ్ బరియాకు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. గత రెండేళ్లుగా ఆయనకు ఓ 23 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం ఉన్నది. వారిద్దరూ మే నెలలో అహ్మదాబాద్‌కు పారిపోయారు. బరియా బావమర్దులు ఫోన్ చేసి తిరిగి వచ్చేయాలని కోరారు. కానీ, రాలేదు. మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశామని, తన స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని బరియాకు మళ్లీ ఫోన్ చేశారు.
Also Read: ఎక్కువ ముస్తాబైందని, సెంట్ కొట్టుకుందని భార్యను షూట్ చేసిన అనుమానపు భర్త
దీంతో బరియా పరబియా గ్రామానికి ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో తిరిగి వచ్చేశాడు. బావమర్దులు వారిద్దరినీ పట్టుకుని వారికో ‘గుణపాఠం’ చెప్పాలని ఓ కరెంట్ స్తంభానికి కట్టేసి చావబాదారు. దీనికి సంబంధించి వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ ఘటన తర్వాత బరియా పోలీసులను గురువారం ఆశ్రయించాడు. ఈ కేసు ఫైల్ చేసిన పోలీసులు బరియా భార్య నలుగురు సోదరులను అరెస్టు చేశారు.