సూరత్: గుజరాత్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా ఉద్యోగులను పదుల సంఖ్యలో నిలబెట్టి లోదుస్తులు విప్పించి, నగ్నంగా వరుసలో నిలబెట్టి గైనకాలజీ ఫింగర్ టెస్టు నిర్వహించారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గైనకాలజిస్టుల తీరుపై ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ లో దాదాపు 100 మంది యువతులు మూడేళ్ల క్లర్క్ ఉద్యోగ శిక్షను పూర్తి చేసుకున్నారు. ఉద్యోగం శాశ్వతం కావడానికి ఫిట్నెస్ టెస్టు అనివార్యం కావడంతో గురువారం సూరత్ మున్సిపల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు వెళ్లారు. వైద్యులు వారిని పది మంది చొప్పున బృందాలుగా ఏర్పాటు చేశారు. 

Also Read: విద్యార్థినుల రెస్ట్‌రూమ్‌లో మొబైల్‌తో రికార్డ్: ప్రాజెక్టు ఆఫీసర్ అరెస్ట్

ఒక్కొక్కరికి విడివిడిగా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పదిమందిని ఒకేసారి గదిలోకి పిలిచి దుస్తులు విప్పించి, నగ్నంగా నిలబెట్టారు. వైద్య సిబ్బంది తమతో దారుణంగా ప్రవర్తించారని ట్రైనీ క్లర్కులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా గర్భం దాల్చారా అని అవివాహిత యువతులను అడిగారని వారు చెప్పారు. 

దానిపై ఉద్యోగ సంఘాల ఫిర్యాదు మేరకు మునిసిపల్ కమిషనర్ బన్ చానిది పాణి శుక్రవారం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని వేశారు. అయితే, తాము నిబంధనల ప్రకారమే పనిచేశామని ఆస్పత్రి గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ అశ్విన్ వచ్చాని తెలిపారు.