Asianet News TeluguAsianet News Telugu

కంచుకోటను కాపాడుకున్న కాషాయ పార్టీ.. గుజరాత్‌ మళ్లీ బీజేపీదే.. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్..!

గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ ఎగ్టిట్ పోల్ అంచనా వేసింది. అయితే బీజేపీ 128-148 స్థానాలు సాధించి గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకుంటుందని తెలిపింది.

gujarat election 2022 Republic tv P Marq Exit Poll predicts BJP Win
Author
First Published Dec 5, 2022, 6:52 PM IST

గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ ఎగ్టిట్ పోల్ అంచనా వేసింది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్‌‌లో అధికారం దక్కించుకోవాలంటే.. 92 మెజారిటీ మార్క్‌ను సాధించాల్సి ఉంటుంది. అయితే బీజేపీ 128-148 స్థానాలు సాధించి గుజరాత్‌లో అధికారాన్ని నిలుపుకుంటుందని రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ ఎగ్టిట్ పోల్ తెలిపింది. కాంగ్రెస్ 30-42 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ అంతగా ప్రభావం చూపకపోవచ్చని పేర్కొంది. ఆప్ కేవలం 2 నుంచి 10 స్థానాలలోపే పరిమితమవుతుందని అంచనా వేసింది. బీజేపీకి 48.2 శాతం, కాంగ్రెస్‌కు 32.6 శాతం, ఆప్‌కు 15.4 శాతం, ఇతరులకు 3.8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ ఎగ్టిట్ పోల్ అంచనా వేసింది. ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. 

ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 27 ఏళ్లుగా గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక, మొదటి విడతలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో సౌరాష్ట్ర, కచ్, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా మొత్తం 39 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. 89 అసెంబ్లీ స్థానాల బరిలో మొత్తం 788 మంది అభ్యర్థులు నిలిచారు. మొదటి దశలో మొత్తం ఓటింగ్ శాతం 63.14గా నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

మొదటి విడతలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో.. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వి- ఖంభాలియా నుంచి, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా(బీజేపీ)- జామ్‌నగర్ నార్త్ నుంచి,  బీజేపీ నేత కాంతిలాల్ అమృతియా- మోర్బి నుంచి,  మాజీ మంత్రి, బీజేపీ నేత పర్షోత్తమ్ సోలంకి - భావ్‌నగర్ రూరల్ నుంచి బరిలోఉన్నారు. 

ఇక, రెండో విడతలో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్‌తో సహా మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 స్థానాల్లో పోలింగ్ జరిగింది. 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండో దశలోని మొత్తం 93 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలిపింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయగా.. దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.  

ఈ దశలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (ఘట్లోడియా), పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ (విరాంగమ్), ఓబిసి నాయకుడు అల్పేష్ ఠాకోర్ (గాంధీనగర్ సౌత్), మాజీ మంత్రి శంకర్ చౌదరి (తారద్), జిగ్నేష్ మేవానీ (వడ్గం) ఉన్నారు. హార్దిక్ పటేల్,  అల్పేష్ ఠాకోర్, శంకర్ చౌదరిలు బీజేపీ  నుంచి పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి మేవానీ బరిలో ఉన్నారు. అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓటును వినియోగించుకున్నారు.  

గుజరాత్‌ బీజేపీకి కంచుకోటగా ఉంది. గుజరాత్‌లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్‌, ఆప్‌లు కూడా బీజేపీకి గట్టి పోటీనిస్తున్నాయి. మోదీ బీజేపీ తరపున భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకుని గుజరాత్ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు. ఆప్ అభ్యర్థుల తరపున కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇక, 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 99 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలను దక్కించుంది. బీజేపీకి పోలైన ఓట్లలో 49.05 శాతం సాధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios