Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ లో కూలిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి .. 91 మంది మృతి.. ప్రమాదంపై సిట్  ఏర్పాటు..

గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి  కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 91 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు

Gujarat bridge collapse: State govt sets up 5-member SIT to probe tragedy
Author
First Published Oct 31, 2022, 1:28 AM IST

గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం  కూలిపోయింది. ప్రమాద సమయంలో దాదాపు 400 మంది వంతెనపై ఉన్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో దాదాపు 91 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వారి మృతదేహాలను మోర్బీస్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 25 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.  దీంతో పాటు క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు మోర్బీ, రాజ్‌కోట్‌ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు ఏర్పాటు చేశారు.  గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
  
ప్రమాదంపై ప్రధాని ఆరా 

ఈ ఘటనపై తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి.. బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని, సహాయక సేవలను ముమ్మరం చేశారని కోరారు. గుజరాత్‌లోని మోర్బీలో బ్రిడ్జి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం కేవడియాలో ఉన్నారని, ఆయన కూడా మోర్బీకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. 

సిట్  ఏర్పాటు..

బ్రిటిష్ కాలం నాటి వంతెన మరమ్మతులు చేసిన వారం రోజులకే కూలిపోవడంపై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వంతెన మరమ్మత్తుల కోసం గత 6 నెలలుగా మూసివేసి వేయబడింది. ఇటీవల సుమారు రూ.2 కోట్లతో దీని మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఇది దీపావళి తర్వాత ఒక రోజు అంటే అక్టోబర్ 25న తిరిగి తెరవబడింది. వంతెన సామర్థ్యం 100 మంది మాత్రమే.. కానీ ఆదివారం సెలవుదినం కారణంగా.. సుమారు 500 మంది ప్రజలు దానిపై గుమిగూడారు. ఇదే ప్రమాదానికి కారణంగా మారింది. 

బ్రిడ్జి కూలిపోయిన చోట 15 అడుగుల మేర నీరు ఉందని, కొంతమంది ఈత కొట్టి బయటకు వచ్చారు. అయితే చాలా మంది ప్రజలు ఆ వంతెనలో ఇరుక్కుపోయారు. వారిని సహాయక సిబ్బంది సురక్షతంగా బయటకు తీశారు. ఇప్పటి వరకూ `170 మందికి పైగా కాపాడినట్టు సహాయక బృందాలు తెలిపాయి.

ఈ వంతెన మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి జగదీష్ పంచాల్ భాస్కర్‌తో జరిగిన సంభాషణలో తెలిపారు. వంతెన సామర్థ్యం దాదాపు 100 మంది ఉంటుందని, అయితే ఆదివారం సెలవు దినం కావడంతో ప్రమాద సమయంలో 400 నుంచి 500 మంది వరకు వంతెనపై గుమిగూడారని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్  

ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ లో SDRF, NDRF బృందాలు సేవలందిస్తున్నాయి. వీరితో పాటు.. కచ్,రాజ్‌కోట్ నుండి 7 ఈతగాళ్ల బృందాలు, అగ్నిమాపక దళాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.అలాగే.. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 50 మంది గరుడ్ కమాండోలు జామ్‌నగర్ నుండి రెస్క్యూ కోసం బయలుదేరారు. వారితో పాటు 50 రెస్క్యూ బోట్లను కూడా పంపించారు. ఈ గరుడ కమాండోలు రాత్రి వేళల్లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తారు. ప్రమాద వివరాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 
 
140 ఏండ్ల నాటి బ్రిడ్జ్   

మోర్బీ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్  140 సంవత్సరాల కిత్రం నాటిది. దీని పొడవు సుమారు 765 అడుగులు. ఈ వేలాడే వంతెన గుజరాత్‌లోని మోర్బీకి మాత్రమే కాకుండా దేశం మొత్తానికి చారిత్రక వారసత్వం. ఈ వంతెనను ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ 20 ఫిబ్రవరి 1879న ప్రారంభించారు. దాదాపు 3.5 లక్షలతో అప్పట్లో పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇంగ్లండ్ నుండే దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుండి ఈ వంతెన అనేక సార్లు పునరుద్ధరించబడింది. ఇటీవల దీపావళికి ముందు 2 కోట్లతో దీని మరమ్మతు పనులు జరిగాయి.
 
ఒరేవా గ్రూప్‌కి నిర్వహణ బాధ్యత  

ఈ బ్రిడ్జి నిర్వహణ బాధ్యత ఒరేవా గ్రూప్‌దే. ఈ బృందం మార్చి 2022 నుండి మార్చి 2037 వరకు 15 సంవత్సరాల పాటు మోర్బి మున్సిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిడ్జ్ సెక్యూరిటీ, క్లీనింగ్, మెయింటెనెన్స్, టోల్ వసూలు, స్టాఫ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను గ్రూప్ నిర్వహిస్తుంది.

ప్రతిపక్షల ఆగ్రహం 
 
ఈ ప్రమాదంపై కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఎన్నికల హడావుడిలో ఎలాంటి అనుమతుల్లేకుండా వంతెనను తెరిచారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ- గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన వంతెన ప్రమాద వార్త చాలా బాధాకరం. ఇలాంటి కష్ట సమయాల్లో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారికి అన్ని విధాలా సాయం అందించాలని, తప్పిపోయిన వారి ఆచూకీ కోసం సహకరించాలని కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios