కరోనా రోగులకు సంబంధించిన హోం ఐసోలేషన్ మార్గ దర్శకాలను కేంద్రం  సవరించింది. వారం రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంటే సరిపోతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా Omicron కేసులు పెరిగపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కరోనా రోగుల హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను కేంద్రం సవరించింది.గతంలో పది రోజుల పాటు స్వీయ నిర్భంధ కాలాన్ని వారం రోజులకు కుదించింది. లక్షణాలు లేని వారు లేదా స్వల్ప లక్షణాలు ఉన్న Corona బాధితులు పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే ఏడు రోజుల పాటు home isolation లో ఉండాలని పేర్కొంది.

ఎప్పుడూ కూడా మూడు లేయర్ల మాస్క్ ను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి ఎనిమిది గంటలకు ఓసారి మాస్క్ ను మార్చుకోవాలని కోరింది. 72 గంటల తర్వాత మాస్క్ ను ముక్కలుగా కత్తిరించాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లాల్సి వస్తే ఎన్-95 మాస్క్ ను ఉపయోగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది.

also read:ప్రకాశంలో కలకలం, ముగ్గురు ఒమిక్రాన్ రోగుల అదృశ్యం.. అధికారుల గాలింపు

కరోనా సోకిన రోగులు ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలని కోరింది. మరో వైపు ఎక్కువగా ద్రవ పదార్ధాలను సేవించాలని కోరింది. శ్వాస స్థాయిలను ఎప్పటికప్పుడూ పరిశీలించుకోవాలని సూచించింది. జ్వరం, ఆక్సిజన్ లెవల్స్ ను చెక్ చేసుకోవాలన్నారు. 

చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో బాధితుడి రూమ్ ను ఇతరులు ఉపయోగించవద్దని కూడా ఆరోగ్యశాఖ తెలిపింది.హోం ఐసోలేషన్ లో ఉన్న బాధితులు వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే ఏడు రోజుల తర్వాత ఐసోలేషన్ నుండి బయటకు రావొచ్చు. అయితే ఆ తర్వాత మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం కోరింది.

అయితే హోం ఐసోలేషన్ తర్వాత ఎలాంటి కరోనా పరీక్షలు అవసరం లేదని కూడా వైద్య ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది.తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 58,097 Covid కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. అయితే ఇవి క్రితం రోజుతో పోల్చితే 55 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనాతో మరో 534మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,551కి చేరింది. నిన్న కరోనా నుంచి 15,389 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,004 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో రోజువారీ పాజివిటీ రేటు 4.18 శాతంగా ఉంది.

మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారత్‌లో భారీగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు 2,135 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఇప్పటివరకు 828 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653 నమోదయ్యాయి. ఆ తర్వాత 464 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.