GST rates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 47వ జీఎస్టీ సమావేశంలో  తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌పై ఇప్పుడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే పాల‌తో పాటు వాటి ఉత్ప‌త్తులు స‌హా ప‌లు నిత్యావ‌స‌ర ఆహార ప‌ద‌ర్థాల‌పై జీఎస్టీ రేట్ల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఇప్ప‌టికే మండిపోతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు జూలై 18 నుంచి మ‌రింతా పెరుగుతూ.. స‌మాన్య ప్ర‌జానీకంపై మ‌రింత భారాన్ని మోప‌నున్నాయి. 

GST rates-daily food items: ఇప్ప‌టికే దేశంలో రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల గృహ బడ్జెట్‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది. ధ‌ర‌ల త‌గ్గింపున‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ల‌బోదిబో మంటున్న‌ సామాన్యులకు మాత్రం ఊరట లభించడంలేదు. ఆహారప‌ద‌ర్థాలు మాత్రమే కాదు, వివిధ నిత్యావసర వస్తువుల ధరలు కూడా రోజురోజుకూ ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిపోతున్నాయి. అయితే, స‌గ‌టు జీవి ఉపాధి, వేత‌నాల పెరుగుద‌ల మాత్రం లేకుండా మ‌రింత దుర్భ‌రంగా మారుతున్న ప‌రిస్థితులు నేడు దేశంలో నెల‌కొన్నాయ‌ని ఆర్థిక నిపుణులు, ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల్సింది పోయి.. స‌మాన్యుల‌పైనే మ‌రోసారి స‌ర్కారు భారం మోప‌డానికి నిర్ణ‌యించుకుంది. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ పెంపుపై అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. దీని కార‌ణంగా వచ్చేవారం నుండి కొన్ని సేవల ధరలను పెంచుతుండ‌టంతో అనేక నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు మ‌రింత‌గా పెర‌గ‌నున్నాయి. గృహ అవ‌స‌రాల కోసం చేసే ఖ‌ర్చులు మ‌రింత‌గా పెరుగుతూ.. ప్ర‌జ‌ల‌పై భారం మోప‌నున్నాయి. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ప్రజలు అవసరమైన ఆహార పదార్థాల కోసం మరింత ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది.

47వ జీఎస్టీ సమావేశం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 47వ జీఎస్టీ సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నట్లు తెలిపారు. జూలై 18, 2022 నుండి కొన్ని కొత్త ఉత్పత్తులు, వస్తువులు-సేవలపై GST రేట్లు పెరుగుతాయని ఆమె చెప్పారు. దీని కార‌ణంగా జూలై 18 నుంచి అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఇక నుంచి రోజువారీ ఆహార పదార్థాలకు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్రం నిర్ణ‌యంతో ధ‌ర‌లు పెరిగేవి ఇవే..

వ‌స్తు సేవ‌ల‌తో పాటు.. నిత్యావ‌స‌రాల‌పై జీఎస్టీ రెట్లు పెంచుతున్న‌ట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని ప్ర‌కారం.. పాల ఉత్ప‌త్తుల ధ‌ర‌లు రికార్డు స్థాయికి పెర‌గ‌నున్నాయి. వాటిలో జున్ను, లస్సీ, వెన్న పాలు, ప్యాక్ చేసిన పెరుగు, గోధుమ పిండి, ఇతర ధాన్యాలు, తేనె, పాపడ్, తృణధాన్యాలు, మాంసం, చేపలు (గడ్డకట్టడం మినహా), మడి, బెల్లం వంటి ప్రీ-ప్యాకేజ్డ్ లేబుల్‌లతో సహా వ్యవసాయ వస్తువుల ధరలు జూలై 18 నుండి పెరగనున్నాయి. ఈ ఉత్పత్తులపై పన్నులు పెంచబడ్డాయి. ప్రస్తుతం బ్రాండెడ్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. 

ప్ర‌జ‌ల‌కు భారం..కంపెనీల‌కు లాభం.. !

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న జీఎస్టీ పెంపు నిర్ణ‌యం వ‌ల్ల కంపెనీల‌కు ఎలాంటి న‌ష్టం లేద‌ని మార్కెట్ నిపుణులు, వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే.. ధ‌ర‌ల పెరుగుద‌ల భారాన్ని కంపెనీలు ప్ర‌జ‌ల‌పైనే మోపుతాయి. నిత్యాస‌ర ఆహార ప‌దార్థాలు, వ‌స్తువులు వీటిలో అధికంగా వున్నాయి కాబట్టి.. ప్ర‌జ‌లు కొన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. కేంద్రం తీసుకున్న‌ ఈ నిర్ణయం కొన్ని కంపెనీల షేర్ల నుండి సంపాదించడానికి కూడా అవకాశం ఇస్తుందిని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మ‌రోవైపు ఖ‌రీదైన వ‌స్తువుల‌పై జీఎస్టీ త‌గ్గిస్తూ.. నిత్యావ‌స‌రాల‌పై పెంచ‌డంతో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

ఎంత‌వ‌ర‌కు ధ‌ర‌లు పెరుగుతాయి? అందులో కొన్ని..

- జూలై 18న ఏయే వస్తువుల ధరలు పెరిగే వాటిలో అధికంగా పాల ఉత్ప‌త్తులు, నిత్యావ‌స‌ర ఆహార ప‌ద‌ర్థాలు ఉన్నాయి. 

- ఇంతకుముందు వర్తించని జులై 18 నుంచి 5% జీఎస్టీ విధించడంతో టెట్రా ప్యాక్ పెరుగు, లస్సీ, మజ్జిగ ధరలు పెరగనున్నాయి. 

- చెక్‌బుక్‌లను జారీ చేయడానికి గతంలో బ్యాంక్ వసూలు చేసే సేవా పన్ను ఇప్పుడు 18% GSTని ఆకర్షిస్తుంది.

- ఆసుపత్రుల్లో రూ.5,000 (నాన్ ఐసీయూ) కంటే ఎక్కువ విలువైన గదులను అద్దెకు ఇస్తే 5 శాతం జీఎస్టీ విధిస్తారు.

- అట్లాస్‌తో కూడిన మ్యాప్‌లకు కూడా 12 శాతం చొప్పున జీఎస్టీ విధించనున్నారు.

- రోజుకు రూ.1,000 కంటే తక్కువ ఉన్న హోటల్ గదులపై ఇంతకుముందు విధించని 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.
- ఎల్‌ఈడీ లైట్, ఎల్‌ఈడీ ల్యాంప్‌లపై గతంలో వర్తించని 18 శాతం జీఎస్టీని విధించనున్నారు. 

- బ్లేడ్లు, పేపర్ కటింగ్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్-సర్వర్లపై గతంలో 12 శాతం జీఎస్టీ ఉండగా, అది 18 శాతానికి పెరిగింది.