ISRO INSAT-3DS launch : విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఇన్‌శాట్ 3 డీఎస్ శాటిలైట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో ).. మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇన్‌శాట్ 3 డీఎస్‌ను జీఎస్ఎల్‌వీ ఎఫ్ 14 ఉపగ్రహ వాహక నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్ 3 డీ, ఇన్‌శాట్ 3 డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇన్‌శాట్ 3 డీఎస్‌ను జీఎస్ఎల్‌వీ ఎఫ్ 14 ఉపగ్రహ వాహక నౌక ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం నిర్వహించారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్ 3 డీ, ఇన్‌శాట్ 3 డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. దాదాపు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి.. శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి చేరడంతో శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందించారు.
వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక కోసం భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను ఇవి చేపడతాయి. తుఫానులు, భూకంపాలు, పిడుగులు, సునామీలను ఇవి ఖచ్చితంగా అంచనా వేస్తాయి. దీని వల్ల భారత్ మరింత అప్రమత్తంగా రైతులకు వాతావరణ సమాచారాన్ని అందించే వీలు కలుగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి రూ.500 కోట్లకు పైగానే ఖర్చయినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ నిధులను కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సమకూర్చింది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటల పాటు కొనసాగించారు.