Asianet News TeluguAsianet News Telugu

కాబోయే భర్త మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోల్పోయాడు.. ‘అయినా అతడినే పెళ్లి చేసుకోవాలా?’ సోషల్ మీడియాలో వధువు పోస్టు

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగికి పెళ్లి ఫిక్స్ అయింది. ఈ నెలలో పెళ్లి తేదీ. కానీ, ఇంతలోనే ఉద్యోగం పోయింది. అయినా ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలా? అని వధువు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు చర్చనీయాంశమైంది. నెటిజన్లు తమవైన కామెంట్లతో పోటెత్తారు.
 

groom lost microsoft job, bride query whether still she would marry him
Author
First Published Feb 3, 2023, 2:13 PM IST

న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. దిగ్గజ సంస్థలూ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీల ఈ నిర్ణయాలతో ఎంతో మంది ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలు గందరగోళంలో పడిపోయాయి. హఠాత్తుగా తలకిందులైపోయాయి. తమ వ్యక్తిగత జీవితంలో వచ్చిన కుదుపులనూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే, తాజాగా, ఓ మహిళ చేసిన పోస్టు కూడా అలాంటి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి జీవితం తాలూకు సవాళ్లను వెల్లడించింది. 

మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి అంటే ఈ నెలలో వారికి పెళ్లి ఫిక్స్ అయింది. కానీ, ఇంతలోనే పిడుగు లాంటి వార్త వచ్చింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టిన కోతలో ఆయన ఉద్యోగం కూడా కొట్టుకుపోయిందనేది ఆ వార్త. దీంతో ఆ రెండు కుటుంబాలూ కలవరంలో మునిగాయి. వధువు కుటుంబం పెళ్లిపై ముందడుగు వేయడానికి తర్జనభర్జన పడింది. ఇక వధువు అయితే.. ఇంకా అతడిని పెళ్లి చేసుకోవాలా? ఉద్యోగం పోయిందని తెలిసీ ముందడుగు వేయాలా? అనే మీమాంసలో పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆమె పోస్టుపై నెటిజన్ల నుంచి విభిన్న రకాల సమాధానాలు వచ్చాయి. కొందరు అతడిని పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదని చెప్పారు. నిర్ణయాలు మనస్సుతో తీసుకోనప్పుడు ఇలాంటి చిక్కులు వస్తాయని చురుకులు అంటించారు. ఇంకొందరు హిపోక్రైట్ అంటూ మాటలు కూడా జారారు. కాగా, కొందరు నిర్ణయాన్ని ఆమెకే వదిలేశారు.

Also Read: రాంపూర్ వీధుల్లో అర్థరాత్రి నగ్నంగా తిరుగుతూ, తలుపులు తడుతున్న మహిళ.. వీడియో వైరల్..

ఆ మహిళ ఇలా పోస్టు చేసింది. తమది అరేంజ్ మ్యారేజ్ అని, 2023 ఫిబ్రవరిలో పెళ్లి తేదీ ఖరారైందని వివరించింది. తనకు కాబోయే భర్త మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోల్పోయాడని తెలిపింది. అయినప్పటికీ అతడినే పెళ్లి చేసుకోవాలా? అని నెటిజన్లను అడిగింది. ఆయన ఉద్యోగం పోయిందనే విషయం తమ కుటుంబానికి కూడా తెలిసిందని, ఇంకా అతడినే పెళ్లి చేసుకోవాలా? అనే ఆలోచనలు తనను చుట్టేస్తున్నాయని పేర్కొంది. ఆమె పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఓ వ్యక్తి ట్వీట్ చేశారు.

చాలా మందిని రిడిక్యులస్ అని కొట్టేయగా.. కొందరేమో అందులోనూ హాస్యం వెతుక్కున్నారు. ఇంకొందరు స్త్రీవాదమెక్కడా? అంటూ వ్యంగ్యం పోయారు. ఇంతటి వ్యక్తిగత నిర్ణయానికి కూడా నెటిజన్ల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం సరి కాదని ఇంకొందరు కామెంట్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా వచ్చిన వాటిని కూడా ఆ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. అందులో మూడు పరిష్కారాలు సూచించారు. ఒకటి, కాబోయే తన భర్తను వెంటనే మరో ఉద్యోగం వెతుక్కోవాలని కోరడం, రెండోది, ఉద్యోగం పోయినా అతడినే పెళ్లి చేసుకోవడం ఉత్తమం.. అతనికి పెద్ద మొత్తంలో సెటిల్‌మెంట్ రూపంలో డబ్బు వస్తుంది, మూడోది.. తనను తాను కపటత్వం గల మహిళగా ఎక్స్‌పోజ్ చేసుకుని పెళ్లి వద్దనుకోవడం అని సమాధానాలు ఉన్నాయి. ఈ ట్వీట్ వైరల్ కావడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios