స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తరువాత కూడా బిజినెస్ చేయడం  ప్రభుత్వ బిజినెస్ కాదని మోడీ అన్నారు. బడ్జెట్ అమలు గురించి మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడారు. దేశానికి స్వతంత్రం వచ్చ్చిన కొత్తలో అప్పటి అవసరాల నిమిత్తం ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు జరిగిందని ఇప్పుడు వాటి అవసరం ఎంతమాత్రం లేదని తెలిపారు ప్రధాని మోడీ. 

అవసరమైన స్ట్రాటజిక్ రంగాల్లో ప్రభుత్వరంగ సంస్థల ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తిస్తుందని, అవసరం లేని రంగాల్లో ప్రభుత్వానికి వేలు పెట్టనవసరంలేదని ప్రధాని మోడీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉండడం వల్ల వాటిని కాపాడడానికి ప్రజల సొమ్ము వెచ్చించవలిసివస్తుందని ప్రధాని తెలిపారు. ఎవరో పెట్ ప్రాజెక్టు కాబట్టి దాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వం వద్ద ఎన్నో నిరర్ధక ఆస్తులు ఉన్నాయని... వాటిని వదిలించుకొని ఆ డబ్బును ప్రజల సంక్షేమం కోసం ఖర్చుపెట్టాలని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ... వారి అవసరాలు తీర్చడంలో మునిగి ఉండాలి తప్ప వ్యాపారం చేయవలిసిన అవసరంలేదని వ్యాఖ్యానించారు.