రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ యోజన లబ్దిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు గడువును మరి కొన్ని రోజుల వరకు పొడగించింది. గతంలో ఈ గడువు మార్చి 31వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. 

కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు నేరుగా అందిస్తున్న పీఎం కిసాన్ యోజ‌న ప‌థ‌కానికి సంబంధించి ఈ - కేవైసీ పూర్తి చేసే గడువును పొడ‌గించింది. ఈ ప‌థ‌కం కింద దేశంలో అనేక మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ నిర్ణ‌యంతో మ‌రెంతో మంది రైతుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. 

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ యోజన) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6 వేల రూపాయలను దేశంలోని రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తుంది. ఈ ఆరు వేల‌ను మూడు విడ‌త‌లుగా అందిస్తుంటుంది. అంటే ప్ర‌తీ 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో 2,000 రూపాయలు జమ అవుతాయి. ఇప్పటి వరకు 10 విడ‌త‌ల్లో రైతుల ఖాతాల్లో డ‌బ్బులు చేరాయి. కాగా ఇటీవ‌లే ఈ ప‌థ‌కానికి కేంద్ర ప్ర‌భుత్వం కొత్త నిబంధ‌న తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కం ప్ర‌యోజ‌నాలు పొందాలంటే ప్ర‌తీ రైతు త‌ప్ప‌ని స‌రిగా eKYCని పూర్తి చేయాల‌ని సూచించింది. ఈ గ‌డువు ఈ నెల 31వ తేదీతో ముగిసిపోనుంది. 

మ‌రో రెండు రోజుల్లో eKYC పూర్తి చేసే గ‌డువు ముగిసిపోతుండటంతో రైతుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఇంకా చాలా మంది రైతులు దీనిపై అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో దీనిని పూర్త చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్ర‌భుత్వం దీనిని దాదాపు మ‌రో రెండు నెల‌ల పాటు పొడ‌గించింది. అంటే ఈ ఏడాది మే 22వ తేదీ వ‌ర‌కు రైతులు ఈ-కేవైసీని పూర్తి చేసేందుకు అవ‌కాశం ల‌భించ‌నుంది. 

ఈ - కేవైసీ ప్ర‌క్రియ‌ను ఎలా పూర్తి చేయాలంటే.. ? 
ఈ -కైవైసీ ప్ర‌క్రియ‌ను రైతులు సొంతంగా కూడా పూర్తి చేయ‌వ‌చ్చు. ముందుగా లబ్దిదారులు PM కిసాన్ అధికారిక వెబ్ సైట్ అయిన https://pmkisan.gov.in/ ను సంద‌ర్శించాలి. ఆ పేజీలోకి వెళ్లిన త‌రువాత కుడి వైపున అందుబాటులో ఉన్న eKYC ఆప్ష‌న్ ను ఎంపిక చేసుకోవాలి. అనంత‌రం వ‌చ్చే కాల‌మ్స్ లో ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి, సెర్చ్ పై క్లిక్ చేయాలి. దీంతో ల‌బ్దిదారుల ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబ‌ర్ కు ఓటీపీ వ‌స్తుంది. త‌రువాత వ‌చ్చే ఓటీపీ కాలమ్ లో మొబైల్ కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయాలి. వివ‌రాలు అన్నీ స‌రిపోతే ఇక్క‌డితో eKYC పూర్త‌వుతుంది. లేక‌పోతే వివ‌రాలు మ్యాచ్ కావ‌డం లేద‌ని చెబుతుంది. eKYC ప్ర‌క్రియ‌ను స్థానిక కామాన్ స‌ర్వీస్ సెంట‌ర్ ద్వారా కూడా పూర్తి చేయ‌వ‌చ్చు. లేదా గ్రామంలో ఉండే అగ్రికల్చ‌ర్ ఆఫీస‌ర్ల‌ను సంప్ర‌దించినా కూడా ఈ ప్ర‌క్రియ‌ను వారు పూర్తి చేస్తారు. 

త్వ‌ర‌లోనే రైతుల ఖాతాల్లోకి 11 విడ‌త డ‌బ్బులు.. 
ఈ ప‌థ‌కం కింద ఏడాదిలో మూడు సార్లు చొప్పున రైతుల ఖాతాలో డ‌బ్బులు జ‌మ అవుతాయి. 2019 సంవత్సరం ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 సార్లు రైతుల‌కు పెట్టుబ‌డి సాయం అందజేసింది. చివరిగా ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1వ తేదీన డ‌బ్బులు జ‌మచేసింది. అయితే 11వ విడ‌త పెట్టుబ‌డి సాయం వ‌చ్చే నెల‌లో విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది.