కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ అనే పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ కి ఇంకా సరయిన మందు లేకపోవడంతో నివారణే మార్గంగా దేశాలన్నీ ఆ దిశగా శ్రమిస్తున్నాయి. జనసమ్మర్ధమైన ప్రాంతాలను మూసివేసి ప్రజలను అలా గుంపులుగా కలవనీయకుండా చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. 

ఇప్పటికే భారతదేశంపై కరోనా తన పంజాను విసరడం ఆరంభించింది. ఇటలీ, అమెరికాలను చూసి త్వరగా మేల్కొన్న భారతదేశం దేశమంతా 21 రోజులపాటు లాక్ డౌన్ ను ప్రకటించింది. 

ఇలా ప్రధాని లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ... ఉత్తరప్రదేశ్ కి చెందిన మహిళా బాబా పోలీసులకు సవాల్ విసిరింది. తన శిష్య బృందంతో కలిసి నేడు దేశమంతా లాక్ డౌన్ లో ఉండగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 

వివరాల్లోకి వెళితే... మా ఆదిశక్తి గా తనను తాను పిలుచుకునే మహిళా బాబా, ఉత్తరప్రదేశ్ లోని మహాదేవ్ పుర లో నివాసముంటుంది. అక్కడే ఒక చిన్న సైజు ఆశ్రమం లాంటిదని ఏర్పాటు చేసుకొని బాబా వృత్తిని ఎంచుకొని తన జీవనం సాగిస్తుంది.

అలా ఆమె నేటి ఉదయం ప్రధాని మోడీ లాక్ డౌన్ అని ప్రకటించినప్పటికీ... ఆమె మాత్రం తన కార్యక్రమాలను యధావిధిగా కొనసాగించేందుకు పూనుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చారు. 

Also Read:కరోనా డేంజర్ బెల్స్.. దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్ : మోడీ

పోలీసులు వచ్చి అక్కడున్న జనాలను స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని పదే పదే కోరినప్పటికీ కూడా ఆమె మాత్రం వెనక్కి తగ్గకుండా కత్తి దూసి దమ్ముంటే తనను అక్కడి నుండి తొలగించాలని సవాల్ విసిరింది. చాలా సేపు ఓపికగా అందరిని వెళ్లిపోవాలని పోలీసులు పదే పదే కోరినప్పటికీ ఆమె మాత్రం అక్కడినుండి వెళ్ళలేదు. 

కత్తి దూసి తన శిష్య బృందాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుండడంతో రెండు వాన్లలో వచ్చిన పోలీసులు అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి నిలబడి అందరిని వెళ్లిపోవాలని, ఆమెను లోపలి వెళ్ళమని, లేకుంటే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అప్పటికి కూడా వినకపోవడంతో... చిటికలో మహిళా పోలీసులు ఆమెనుంచి కత్తిని లాక్కొని ఆమెను అరెస్ట్ చేసారు. 

స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని  పోలీసులు అదుపులోకి తెచ్చారు. ఆమెను అరెస్ట్ చేసారు. ఆమెను అరెస్టు చేయడంతో ఆమె శిష్యగణమంతా అక్కడి నుండి పరుగు లంఘించుకున్నారు. ఆమె శిష్య బృందం లోని చాలా మంది ఉత్తరప్రదేశ్ కి చెందినవారు కాకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఆ శిష్యుల్లో చాలా మంది పక్కనున్న బీహార్ రాష్ట్రానికి చెందినవారు. 

Also Read:దేశంలో కరోనా కేసుల సంఖ్య 566: రాష్ట్రాల వారీగా తాజా లెక్కలు ఇవీ...

ఇకపోతే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు నరేంద్రమోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. మంత్రివర్గ సభ్యులు సామాజిక దూరాన్ని పాటిస్తూ  సమావేశంలో మంత్రులు కూర్చొన్నారు. మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం నాడు మధ్యాహ్నం న్యూఢిల్లీలో మీడియాకు వివరించారు.

ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను సదుపాయాలను అందుబాటులో ఉంచామన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నట్టు కేంద్రం తేల్చి చెప్పింది. 

పేదలకు మూడు రూపాయాలకే కిలో బియ్యం, రెండు రూపాయాలకే కిలో గోధుమలు అందిస్తామన్నారు.దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి రేషన్ స్కీమ్ ద్వారా లబ్ది పొందే అవకాశం ఉందన్నారు మంత్రి.వచ్చే మూడు మాసాల పాటు గోధుమలు, బియ్యం నామమాత్ర ధరకే సరఫరా చేస్తామని మంత్రి ప్రకటించారు.

నిత్యావసర సరుకులను నిర్ణీత సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కేంద్రం ప్రకటించింది. కార్మికులకు జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

కరోనా నివారణకు సోషల్ డిస్టెన్స్ సరైన మార్గమని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ కు సహకరించాలని కేంద్ర మంత్రి ప్రజలను కోరారు.కరోనాపై వదంతులు నమ్మొద్దని కేంద్ర మంత్రి చెప్పారు. జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు జవదేకర్ ప్రకటించారు.

ఎకనామిక్స్ ఎఫైర్స్ కేబినెట్ కమిటి రూ.1340 కోట్లను గ్రామీణ బ్యాంకుల రీ కాపిటలైజేషన్ కోసం కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మంత్రి చెప్పారు.అలీఘర్-హర్‌దుర్గంజ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.22కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ఫ్లై ఓవర్ ను  ఐదేళ్లలో పూర్తి చేయనున్నట్టు మంత్రి చెప్పారు.