దేవీ నవరాత్రుల వేళ అపచారం ... కాళీమాతకు పీఎం మోదీ బహూకరించిన కిరీటం చోరీ (సిసి వీడియో)
దేవీ శరన్నవరాత్రుల వేళ పక్కదేశం బంగ్లాదేశ్ లో ఘోర అపచారం జరిగింది. అక్కడి హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజించే కాళీమాత కిరీటాన్ని దుండగులు దోచుకెళ్లారు.
బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు ఇటీవల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది. ప్రస్తుతం దేవీ నవరాత్రుల వేళ బంగ్లాదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం జెషోరేశ్వరి కాళీ ఆలయంలో అమ్మవారికి నగలతో అలంకరించారు. ఈ క్రమంలోనే అమ్మవారి బంగారు కిరీటాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ దొంగతనం ఘటన ఆలయంలోని సిసి కెమెరాల్లో రికార్డయ్యింది.
బంగ్లాదేశ్ లోని సత్ ఖిరా నగరంలో జెషోరేశ్వరి కాళీ ఆలయం వుంది. ఆ దేశంలోని హిందువులే కాదు భారత్ నుండి వెళ్లిమరీ చాలామంది ఆ అమ్మవారిని దర్శించుటారు. 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. కాళీమాతకు బంగారు కిరీటాన్ని బహూకరించారు భారత ప్రధాని.
అయితే తాజాగా కాళీమాత ఆలయంలో గుర్తుతెలియని దుండుగులు చోరీకి పాల్పడ్డారు. ఈ దొంగతనం దృశ్యాలు ఆలయంలోని సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. అక్టోబర్ 10న పట్టపగలు 2.50 గంటలకు ఆలయంలోకి చొరబడ్డ దుండుగులు అమ్మవారి తలపైని కిరీటాన్ని దొంగిలించారు.
ప్రతిరోజు మాదిరిగానే నిన్న(గురువారం) కూడా జెషోరేశ్వరి కాళీ మాతకు పూజారి పూజలు నిర్వహించారు. ఆయన వెళ్లిపోయాక ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునే రేఖ సర్కార్ కు మాత్రమే వున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఆమె వేరే పనుల్లో నిమగ్నమై వుండగా మెళ్లిగా ఆలయంలో చొరబడ్డారు. అమ్మవారికి అలంకరించిన బంగారు కిరీటాన్ని తీసుకుని మెళ్ళిగా జారుకున్నారు.
అయితే తన పని ముగించుకుని అమ్మవారి విగ్రహం వద్దకు వచ్చిన రేఖా సర్కార్ కిరీటం కనిపించకపోయేసరికి కంగారు పడిపోయారు. ఆలయమంతా వెతికినా ఎక్కడా కిరీటం జాడ కనిపించలేదు. దీంతో సిసి కెమెరాలను పరిశీలించగా దొంగతనం దృశ్యాలు బైటపడ్డాయి. దీంతో వెంటనే స్థానిక పోలిసులకు సమాచారం అందించారు.