వీఐపీ కల్చర్‌తో ప్రజలు విసిగిపోయారని, ముఖ్యంగా ఆలయాల్లో దీనిపై అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుందని మద్రాస్ హైకోర్టు తెలిపింది. వీఐపీ దర్శనాలను కేవలం ఆ వీఐపీకి, వారి కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలని, బంధువులకు విస్తరించరాదని స్పష్టం చేసింది. వీఐపీ కేటగిరీకి చెందని ప్రముఖులు, ముఖ్యమైన వ్యక్తులైనా సరే.. సాధారణ మార్గంలోనే దేవుడిని దర్శించుకోవాలని పేర్కొంది.
చెన్నై: వీఐపీ సంస్కృతితో ప్రజలు విసిగి వేశారు. చాలా సందర్భాల్లో పౌరుల సమానత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుంటాయి. వీఐపీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలో తప్పు లేదు. కానీ, ఆ సదుపాయం దుర్వినియోగం అవుతుండటంపైనే అభ్యంతరాలు అన్నీ. ముఖ్యంగా ప్రసిద్ధ దేవాలయాలలో వీఐపీ దర్శన్ పేరిట అడ్డగోలు వ్యవహారాలు జరుగుతుంటాయి. ఈ విషయంపైనే తాజాగా, మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ఈ వీఐపీ కల్చర్ తో విసిగిపోయారని పేర్కొంది. ముఖ్యంగా ఆలయాల్లో ఈ సంస్కృతిపై ఆగ్రహం కనిపిస్తుందని వివరించింది. వీఐపీ ఎంట్రీ సదుపాయం కేవలం ఆ వీఐపీలకు, వారి కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలని, అంతేకానీ, వారి బంధువులకూ విస్తరించరాదని స్పష్టం చేసింది.
తమిళనాడు తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌లోని ప్రసిద్ధ అరుల్మిగు సుబ్రమణియ స్వామి ఆలయానికి సంబంధించిన ఓ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియం ఈ తీర్పు వెలువరించారు.
కొందరు వ్యక్తులు ప్రత్యేక దర్శనం పొందే అర్హత కలిగి ఉంటారనేది నిర్వివాదాంశం అని కోర్టు తెలిపింది. కానీ, ఆ సదుపాయాన్ని కేవలం సంబంధిత ప్రత్యేక అధికారులకు మాత్రమే ఉండాలని, అంతేకానీ, ఇతరులకు విస్తరింపరాదని వివరించింది. ఈ వీఐపీ కల్చర్‌తో ప్రజలు విసిగిపోయారని, ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో ఈ అసంతృప్తితో ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. వీఐపీలకు, ముఖ్యమైన వ్యక్తులకు ప్రత్యేక దర్శనం పేరిట సాధారణ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారని వివరించింది. దీని ద్వారా సాధారణ ప్రజలు ఆవేదనకు గురవుతుంటారని పేర్కొంది.
కాబట్టి, ఆలయ అడ్మినిస్ట్రేషన్ కచ్చితంగా వీఐపీ దర్శనం సదుపాయాన్ని సాధరాణ దర్శనానికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా నిర్వహించాలని వివరించింది. వీఐపీల జాబితాున తమిళనాడు ప్రభుత్వం నోటిఫై చేసిందని, ఆ జాబితాను టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ తప్పకుండా మెయింటెయిన్ చేయాలని ఆదేశించింది. ఆ జాబితాకు అనుగుణంగానే వీఐపీ దర్శనాలకు అనుమతులు ఇవ్వాలని తెలిపింది.
సాధారణ భక్తులు దర్శనం పొందే హక్కులను కాలరాస్తూ వీఐపీలకు స్పెషల్ ఎంట్రీ ఉండరాదని, వీఐపీ దర్శనం కోసం సాధారణ భక్తుల హక్కులు పణంగా పెట్టరాదని స్పష్టం చేసింది. సాధారణ భక్తుల హక్కులకు ఇబ్బందులు లేకుండానే వీఐపీ దర్శనాలను నిర్వహించాలని వివరించింది. అలాగే, వీఐపీ ఎంట్రీ కేవలం వారి కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలని, వారి బంధువులకూ అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేసింది. అలాగే, వీఐపీలకు సెక్యూరిటీ గార్డులూ ఉండవచ్చని, వారినీ వీఐపీలతో లోనికి పంపవచ్చని వివరించింది. కానీ, వీఐపీలకు ఉండే ఇతర స్టాఫ్ సభ్యులు, ఇతర డిపార్ట్‌మెంట్ సిబ్బందిని వీఐపీలతోపాటు ప్రత్యేక దర్శనాలకు అనుమతించరాదని పేర్కొంది.
వీఐపీల స్టాఫ్ మెంబర్స్ లేదా ఆయనకు సంబంధించిన ఇతర సిబ్బంది దైవ దర్శనం చేసుకోవాలనుకుంటే డబ్బు చెల్లించే క్యూలో లేదా ఉచిత దర్శనం లైన్‌లో నిలబడి సాధారణ భక్తులతో పాటే దర్శనం చేసుకోవాలని కోర్టు తెలిపింది.
‘దేవుడు మాత్రమే వీఐపీ. ఇంకే వీఐపీ అయినా.. సాధారణ భక్తులకు అంతరాయం కలిగిస్తున్నారంటే వారు మతపరమైన పాపం చేస్తున్నట్టే. దాన్ని దేవుడు క్షమించడు. కాబట్టి, వీఐపీ కేటగిరీలో చేరని ప్రభుత్వ శాఖల్లో కీలకంగా ఉండే ప్రముఖ ప్రజా సేవకులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులకూ ప్రత్యేక మార్గాల్లో, లేదా వీఐపీ దారి గుండా దర్శనాలు చేయించరాదు’ అని కోర్టు పేర్కొంది.
