దేశ ప్రధాని నరేంద్రమోదీకి ఓ గ్రామ సర్పంచ్ సవాల్ విసిరాడు. ఇటీవల కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్.. ఫిట్ నెట్ ఛాలెంజ్ కి తెరలేపిన సంగతి తెలిసిందే. ఆయన ఛాలెంజ్ కి స్పందించన సినీ నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు ఇలా అందరూ దానిని ఫాలో అయ్యారు. అయితే.. ఈ ఛాలెంజ్ కాదు మీరు చేయాల్సింది.. నా ఛాలెంజ్ స్వీకరించండి అంటూ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు ఓ గ్రామ సర్పంచ్ సవాలు విసిరాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ గోవాలోని అకెమ్ బయిసో గ్రామ పంచాయితీ సర్పంచ్ సిద్ధేశ్ భగత్ ఈ సవాలు విసిరాడు. ఇంతకీ సవాలేంటో తెలుసా..? ఒక్కరోజు రైతు జీవితాన్ని గడపాలి. అంటే దుక్కి దున్నడం, కలుపుతీయడం, విత్తనాలు నాటాలి. ఇలా రైతు చేసే ప్రతి పనీ వారు చేయాలనమాట.

‘ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ కాదు.. రైతులు అనుభవించే కష్టాలు అందరికీ తెలియాలనే ఈ ఛాలెంజ్ చేశాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలి’’ అని అన్నారు. అయితే భగత్ ఛాలెంజ్ విసరడంతో ఆపలేదు.. మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యవసాయ క్షేత్రంలోకి ఎప్పుడు అడుగుపెడుతున్నారు? అంటూ ప్రశ్నించారు. వీరు వ్యవసాయం క్షేత్రంలోకి వచ్చి.. రైతులతో ఉండి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
 
కాగా, గోవాలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. వరి పొలాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు అలెక్సో రెజినాల్డో లారెన్స్ మొదటగా ఈ సవాల్‌ను స్వీకరించారు. ట్రాక్టర్‌ చేతపట్టి పొలంలో దున్నడం మొదటు పెట్టారు. విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. రాష్ట్ర రెవెన్యూ మంత్రి రోహన్ కౌంటే కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. తన నియోజకవర్గం పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలోకి దిగి పనులు మొదలుపెట్టారు.