గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గోవాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ.. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గోవాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవాలో బీజేపీ 19, కాంగ్రెస్ 12 స్థానాల్లో ముందజలో కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ఇతర పక్షాలు కీలక పాత్ర పోషించే అకాశం కనిపిస్తుంది. అయితే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో.. గోవాలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మంతనాల జరుపుతుంది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం బీజేపీ నేతలు గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే అవకాశం కనిపిస్తుంది. 

గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును కూడగట్టే పనిలో బీజేపీ అగ్రనాయకులు ఉన్నారు. ఇందుకు సంబంధంచి గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గోవా ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ గురువారం మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), స్వతంత్ర అభ్యర్థుల నుండి మద్దతు తీసుకుంటుందని చెప్పారు. 

ఇక, ఎర్లీ ట్రెండ్స్‌లో ప్రమోద్ సావంత్ వెనకంజలో ఉన్నప్పటికీ.. చివరకు విజయం సాధించారు. Sanquelim Assembly అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన ప్రమోద్ సావంత్.. కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేష్ సగ్లానీపై 625 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. ఇక, గోవాలో సోమవారం సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుపొందిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తొలుత చిన్న పార్టీలతో జత కట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

పర్యాటక రాష్ట్రంగా పేర్గాంచిన గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ లేదా కూటమి అయినా 21 సీట్లు సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఫిబ్రవరి 14న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 79%గా నమోదైంది. అత్యధికంగా సీఎం ప్రమోద్ సావంత్ పోటీ చేసిన నియోజకవర్గంలో 89.64 శాతంగా రికార్డ్ అయింది. అయితే, ఈ సారి పోలింగ్ శాతం గత ఎన్నికల్లో(81.21శాతం) కంటే తగ్గింది.