Goa Assembly election 2022: గోవాలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. రాష్ట్రంలో  బీజేపీ బ‌ల‌ప‌డ‌టంలో ఎంత‌గానో కృషి చేసిన దివంగ‌త నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ కుమారుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ బీజేపీ గుడ్ బై చెప్పాడు. ప‌నాజీ నియోజ‌క వ‌ర్గం నుంచి స్వ‌తంత్య్ర అభ్యర్థిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నాన‌ని ప్ర‌క‌టించాడు.  

Goa Assembly election 2022: దేశంలో వ‌చ్చే నెల‌లో ఉత్త‌రప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఈ క్ర‌మంలో వివిధ రాజ‌కీయ పార్టీల నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిల్చే అభ్య‌ర్థులు, నేతలు ఒక‌రిపై ఒక‌రు చేసుకుంటున్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. గోవాలోనూ కొత్త‌గా తృణ‌మూల్‌ ఎన్నిక‌ల బ‌రిలోకి దూక‌డంతో అక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు రచిస్తున్నాయి. 

అయితే, ఎన్నిక‌లు జ‌రిగే ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ (Bharatiya Janata Party-BJP) ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీని విడుతున్న మంత్రులు, ముఖ్య నేత‌ల సంఖ్య పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP). ఇక గోవాలో ఎన్నిక‌ల (Goa Assembly election 2022) కు ముందు బీజేపీ గ‌ట్టి షాక్ త‌గిలింది. గోవా మాజీ సీఎం, దివంగత నేత‌ మనోహర్ పారికర్ (Manohar Parrikar) కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీ మ‌ధ్య గ‌త కొంత కాలంగా కోల్డ్ వార్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే అన్ని ఊహాగానాలకు తెరదించుతూ, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ఉత్పల్ పారికర్ (Utpal Parrikar) ప్రకటించారు. 

1994 నుండి అతని తండ్రి గోవా మాజీ ముఖ్యంత్రి, దివంగ‌త నేత మ‌నోహ‌ర్ పారిక‌ర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప‌నాజీ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉత్ప‌ల్ పారిక‌ర్ కు టిక్కెట్ నిరాకరించిన కొన్ని గంటల తర్వాత గోవా ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఉత్పల్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్ప‌ల్ పారిక‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను అధికారం కోసం, ఏ పదవి కోసం పోరాడటం లేదు. మా నాన్నగారి విలువల కోసం పోరాడుతున్నాను. బీజేపీ పాత కార్యకర్తలు నా వెంట ఉన్నారని' అన్నారు. గ‌తంలో, ఇప్పుడు బీజేపీని ఒప్పించ‌డానికి అన్ని విధాల ప్ర‌య‌త్నించాను కానీ ప‌నాజీ టిక్కెట్ తెచ్చుకోలేక‌పోయాన‌ని అన్నారు. త‌న రాజ‌కీయ జీవితాన్ని ప‌నాజీ ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని వెల్ల‌డించారు.

ఉత్ప‌ల్ కు ప‌నాజీ (Panaji) స్థానం టిక్కెట్ ఇవ్వ‌కుండా.. బిచోలిమ్ సీటు కేటాయించింది బీజేపీ. అయితే, దీనిని ఉత్ప‌ల్ తిర‌స్క‌రించ‌డంతో బిచోలిమ్ సీటును రాజేష్ పట్నేకర్‌కు ఇచ్చారు. అలాగే, గోవా పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి దీపక్ ప్రభు పౌస్కా కూడా బీజేపీ గుడ్ బై చెప్పారు. రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. Sanvordem assembly constituency నుంచి ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌డానికి బీజేపీ నిరాక‌రించ‌డంతో ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదిలావుండ‌గా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన సహా ఇతర రాజ‌కీయ పార్టీలు ఉత్ప‌ల్ పారిక‌ర్ ను త‌మ పార్టీలో చేరాలంటూ ఆహ్వానం పలికాయి. 

కాగా, గోవాలో (Goa) మొత్తం 40 స్థానాలుకు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. అలాగే, గోవాతో పాటు ఉత్తరప్రదేశ్‌లో 403 నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 117 నియోజకవర్గాలున్న పంజాబ్‌లో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా ఫిబ్రవరి 20న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. 60 స్థానాలున్న మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న అన్ని అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.