లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా షెల్టర్‌ హోంకు సంబంధించి మరో ఘోరం వెలుగు చూసింది. షెల్టర్ హోమ్ యజమానురాలు గిరిజా దేవి బాలికల చేత కార్యక్రమాల్లో నృత్యాలు చేయించేదని, వారిని సేవకుల్లా చూసేదని తేలింది. 2009లో షుగర్ మిల్ కార్మికుడైన మోహన్ భార్య గిరిజా దేవి గోరఖ్‌పూర్‌లోని డియోరియాలో మూడు షెల్టర్ హోంలు తెరిచింది. 

 గిరిజా దేవి షెల్టర్ హోమ్స్‌పై విచారణ జరిపిన సీబీఐ వాటిని మూసివేయాలని ఆదేశించింది. సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా పోలీసులు గిరిజా దేవి షెల్టర్ హోంకు అమ్మాయిలను పంపించిన విషయం వెలుగు చూసింది. ఆమెకు ఉన్నతాధికారులతో, రాజకీయ నేతలతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆస్తులు కూడా పెద్ద యెత్తున కూడబెట్టినట్లు చెబుతున్నారు.
 
గిరిజా దేవి షెల్టర్ హోమ్స్‌కు 2017లో లైసెన్స్ గడువు ముగిసింది. అయినా కూడా వాటిపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. ఈ ఏడాది జూలై 31న షెల్టర్ హోమ్స్‌కు తనిఖీకి వెళ్లిన జిల్లా ప్రొహిబిషన్ అధికారి ప్రభాత్ కుమార్, పిల్లల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారిపై గిరిజ, ఆమె సిబ్బంది దాడికి దిగారు.
 
ఈ నెల 5న హోం నుంచి ఓ అమ్మాయి తప్పించుకుని బయటకు వచ్చింది. దాంతో ఘోరాలు బయటకు వచ్చాయి. షెల్టర్ హోమ్స్‌లలో గిరిజ సెక్స్ రాకెట్ నడిపిస్తోందని, బాలికలను పనివాళ్లలా చూస్తోందని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. బాలిక ఇచ్చిన సమాచారంతో షెల్టర్ హోమ్స్‌పై దాడి చేసిన పోలీసులు మిగతా బాలికలను రక్షించారు. గిరిజ, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.
 
జిల్లా మాజీ మేజిస్ట్రేట్ సుజీత్ కుమార్‌తో కలిసి గిరిజ, ఆమె కుటుంబ సభ్యులు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో సుజీత్ కుమార్‌ పేరును కూడా చార్జిషీట్‌లో నమోదు చేశారు. 

సాయంత్రం వేళల్లో తరచూ కార్లలో కొందరు వ్యక్తులు వచ్చేవారని, గిరిజతో మాట్లాడిన అనంతరం అమ్మాయిలను తమతో తీసుకెళ్లావారని షెల్టర్ హోమ్స్ నుంచి తప్పించుకున్న బాలికలు చెప్పారు.