హర్యానాకు చెందిన అంజలి సీబీఎస్‌ఈ పదో తరగతిలో 100 శాతం స్కోర్ సాధించింది. కానీ, తల్లి మాత్రం ఖంగారులో పడిపోయింది. ఈ చదువులకే చాలా కష్టపడ్డానని, ఆమెను ఇంకా పై చదువులు ఎలా చదివించేదని మదనపడింది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న తాము బిడ్డను ఎలా చదివించాలని ఆలోచనలో పడింది. ఇంతలోనే అంజలిని అభినందించడానికి ఫోన్ చేసిన సీఎం మనోహర్ లాల్ ఖట్టార్‌ను ఆర్థిక సహాయం అందించగా నెలకు రూ. 20 వేల స్కాలర్‌షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు.
న్యూఢిల్లీ: పిల్లలు మంచి చదువులు చదవాలనుకుంటారు. చదివిన ప్రతి క్లాసులో టాప్‌లో ఉండాలని అనుకుంటారు. అందుకోసం మంచి స్కూళ్లలో వేయాలని తపన పడతారు. ఫీజులు ఎక్కువైనా సరే.. ఎలాగోలా కట్టి వారిని చదివిపిస్తుంటారు. పరీక్షల్లో వారు మంచి మార్కులు సంపాదిస్తే అంతా మరిచి గాల్లో తేలుతారు. కానీ, హర్యానాకు చెందిన ఓ మహిళ తన కూతురు టాప్ స్కోరర్ అని తెలిసి ఆందోళనకు గురైంది.
హర్యానాలోని మహేందర్‌గడ్ జిల్లాకు చెందిన ఊర్మిల తనయ అంజలి చదువుల్లో రాణిస్తున్నది. ఇటీవలే విడుదలైన సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో ఆమె 100 శాతం స్కోర్ సాధించింది. దీంతో ఊర్మిల తల్లి ఒకవైపు సంతోషపడుతూనే మరో వైపు ఆందోళనలకు గురైంది. తన బిడ్డ చదువును ఇకపై ఎలా కొనసాగించేదనే మదనపడింది. పేదరికంతో అల్లాడుతున్న తాము బిడ్డ పై చదవులకు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేదని వ్యధకు లోనైంది.
ఇంతలోనే పదో తరగతిలో 100 శాతం మార్కులు సాధించిన అంజలిని అభినందించడానికి రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమెను ప్రశంసించారు. ఇదే ఫోన్‌లో ఊర్మిల తమ కుటుంబ ఆర్థిక కష్టాల గురించి చెప్పింది. తన కూతురును చదివించాలని ఉన్నా.. తమతో సాధ్యపడటం లేదని తెలిపింది. తాము నిస్సహాయంగా ఉన్నందున తమ కూతురు చదువు కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరింది.
అంజలి డాక్టర్ కావాలనుకుంటున్నది. దేశంలోనే టాప్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఎయిమ్స్‌లో చదువుకోవాలని భావిస్తున్నది. కానీ, ఇల్లు మొత్తం తల్లి ఊర్మిల చేతుల కష్టం మీదే గడుస్తున్నది. తండ్రి పారామిలిటరీలో చేరాడు. 2010లో యాక్సిడెంట్‌కు గురి కావడంతో మెడికల్ కారణాల రీత్యా ఆయనను 2017లోనే సర్వీసుల నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ పరిస్థితుల్లో అంజలిని చదివించడం చాలా కష్టంగా ఉన్నదని తల్లి.. సీఎం మనోహర్ లాల్ ఖట్టార్‌కు తెలిపారు.
దీంతో సీఎం వెంటనే సానుకూలంగా స్పందించారు. అంజలి చదువుకు ఆర్థిక తోడ్పాటు అందించడానికి అంగీకరించారు. వచ్చే రెండేళ్లపాటు అంజలికి నెలకు రూ. 20 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె చదువులో అన్ని విధాల సహకరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
