భారతదేశంలో పర్యటిస్తున్న జర్మనీ ప్రభుత్వ ఫెడరల్ మంత్రి వోల్కర్ విస్సింగ్ యుపిఐ(UPI) చెల్లింపుపై ప్రశంసలు కురిపించారు. ఇది భారతదేశ విజయగాథల్లో ఒకటి అంటూ పేర్కొన్నారు.
భారతదేశంలోని జర్మన్ ఎంబసీ భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రశంసించింది. భారతదేశ విజయగాథల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన ఒకటిగా పేర్కొంది. వివరాల్లోకెళ్తే.. జర్మనీ ప్రభుత్వ ఫెడరల్ మంత్రి వోల్కర్ విస్సింగ్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. G-20 డిజిటల్ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు విస్సింగ్ ఆగస్టు 18న బెంగళూరు చేరుకున్నారు.
ఆగస్టు 19న జరిగిన జి-20 డిజిటల్ మంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశ అనంతరం.. జర్మనీ మంత్రి వోల్కర్ విస్సింగ్ బెంగుళూర్ వీధుల్లో షాపింగ్ ఎంజాయ్ చేశారు. ఈ సమయంలో ఆయన భారతదేశ డిజిటల్ పేమెంట్ వ్యవస్థ (యూపీఐ)కు ఆ జర్మన్ మంత్రి ఆకర్షితులయ్యారు.
'భారత విజయ గాథ'
ఈ క్రమంలో జర్మన్ ఎంబసీ సోషల్ మీడియా(ఎక్స్)లో ఓ పోస్ట్ చేస్తూ.. 'భారతదేశ విజయ కథలలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఒకటి, UPIతో సెకన్లలో లావాదేవీలు జరుగుతాయి. కోట్లాది మంది భారతీయులు దీనిని ఉపయోగిస్తున్నారు.జర్మన్ మంత్రి విస్సింగ్ కూడా UPIని ఉపయోగించారు. ఈ సిస్టమ్ తనని ఎంతో ఆకట్టుకుంది. అని పేర్కొంది.
ఫ్రాన్స్, సింగపూర్ వంటి దేశాలు కూడా డిజిటల్ చెల్లింపు వ్యవస్థపై ఆసక్తి చూపాయి.UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) అనేది మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ. ఇది వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA)ని ఉపయోగించి వ్యక్తులు ఎప్పుడైనా తక్షణ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. శ్రీలంక, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ కూడా భారతదేశ యూపీఐ వ్యవస్థను అమలు చేయాలనుకుంటున్నాయి. దీని కోసం ఆయా దేశాలు భారతదేశంతో ఒప్పందం చేసుకున్నాయి. చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించేందుకు ఇటీవల భారత్, ఫ్రాన్స్ మధ్య కూడా ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని స్వయం ప్రధాని మోదీ వెల్లడించారు.
