గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఒకప్పుడు మాఫియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేదని, పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వ్యాపారవేత్తలను అపహరించడం చేసేవారని ఆయన గుర్తుచేశారు.

ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలకు సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దోపిడీలు, బెదిరింపులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శనివారం గోరఖ్‌పూర్‌లో బాటిలింగ్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. గతంలో శాంతి భద్రతలను గౌరవించని వారు ఇప్పుడు ప్రాణాల కోసం పరిగెడుతున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వారికి కోర్టులు శిక్ష విధిస్తున్నప్పుడు, గ్యాంగ్‌స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. మాఫియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేదని, పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వ్యాపారవేత్తలను అపహరించడం చేసేవారని ఆయన గుర్తుచేశారు. 

2006లో ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టార్ అతిక్ అహ్మద్ మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించి.. వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అహ్మద్‌పై వందకు పైగా కేసులు నమోదైన నేపథ్యంలో అతనికి ఇదే తొలి శిక్ష అన్నారు. 60 ఏళ్ల అతిక్ అహ్మద్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి రోడ్డు మార్గంలో ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చారు యూపీ పోలీసులు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో.. పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేస్తారని అతను ఆరోపించాడు. మార్గమధ్యంలో అహ్మద్ వాహనాన్ని మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఆపారు.. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అతనిని భయపడుతున్నారా అని అడగ్గా.. అలాంటిదేమి లేదన్నాడు. 

Also Read: ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. నిందితుడైన బాలుడు అరెస్టు..

2005 జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలు బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో సాక్షి అయిన ఉమేశ్ పాల్ హత్య తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతిక్ , అతని గ్యాంగ్‌పై కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. అంతేకాదు.. రాష్ట్రంలో మాఫియాను నిర్మూలిస్తానని సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ భీకర ప్రతిజ్ఞ చేశారు. 2018లో వ్యాపారవేత్త మోహిత్ జైస్వాల్ కిడ్నాప్‌కు సంబంధించి అహ్మద్, అతని కుమారుడు ఉమర్ సహా మరో 15 మందిపై లక్నోలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం అభియోగాలు మోపింది. అహ్మద్.. జైల్లో వున్నప్పటికీ గోమతీనగర్‌లోని తన కార్యాలయం నుంచి జైస్వాల్‌ను కిడ్నాప్ చేయించాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ క్రమంలో అతనిని డియోరియా జైలుకు తరలించారు.