గంగా విలాస్ క్రూయిజ్ నిలిచిపోలేదు.. షెడ్యూల్ ప్రకారమే పాట్నాకు వెళ్లింది: కేంద్రం స్పష్టీకరణ
గంగా విలాస్ క్రూయిజ్ బిహార్‌లోని ఛాప్రాలో నిలిచిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. ఆ షిప్ షెడ్యూల్ ప్రకారమే ఇప్పుడు పాట్నా చేరుకుందని తెలిపింది. పెద్ద షిప్‌లను ఒడ్డుకు తీసుకురావడం ఎక్కడా కుదరదని, చిన్న బోట్‌లలోనే ప్రయాణికులు సైట్స్ చూస్తారని, ఇది కొత్తేమీ కాదని షిప్ ఆపరేటర్ వివరించారు.

న్యూఢిల్లీ: గంగా విలాస్ క్రూయిజ్ బిహార్‌లోని ఛాప్రాలో నదీలోతు తగ్గడం మూలంగా ప్రయాణికులను ఒడ్డుకు చేర్చలేదనే వార్తలు పూర్తిగా అవాస్తవం అని కేంద్రం స్పష్టం చేసింది. ఆ క్రూయిజ్ షెడ్యూల్ ప్రకారమే పాట్నాకు చేరుకుందని వివరించింది. చాప్రాలో ఈ క్రూయిజ్ చిక్కుకుందని వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారమే ఇక మీదటా ప్రయాణం జరుగుతుందని ఐడబ్ల్యూఏఐ చైర్మన్ సంజయ్ బందోపాధ్యాయా పేర్కొన్నారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేసి స్పష్టత ఇచ్చింది.
గంగా విలాస్ క్రూయిజ్ ఆపరేటర్ కూడా ఈ వార్తలను ఖండించారు. క్రూయిజ్ నుంచి ఛాప్రాలోని చిరండ్ సైట్‌ను చూడటానికి చిన్న పడవల్లో వెళ్లారని వివరించారు. నదీ మధ్యలోనే క్రూయిజ్ షిప్‌ను నిలిపారని, టూరిస్టులు బోట్‌లను వేసుకుని సైట్స్ చూశారని తెలిపారు. సాధారణంగా షిప్‌లను నదీ మధ్యలోనే యాంకర్ వేసి ఆపుతారని చెప్పారు. ప్రయాణికులు చిన్న బోట్‌ల ద్వారానే సైట్స్‌కు వెళ్లి సందర్శించి వస్తారని పేర్కొన్నారు. పెద్ద షిప్‌లు బీచ్‌లకు, ఘాట్‌లకు వెళ్లలేవుగా అని స్పష్టత ఇచ్చారు.
గంగా విలాస్ క్రూయిజ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రూయిజ్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. యూపీలోని వారణాసి నుంచి అసోంలోని దిబ్రుగడ్ వరకు (51 రోజులు) ప్రయాణించే ఈ క్రూయిజ్‌లో దారి మధ్యలో వచ్చే చారిత్రక ప్రదేశాలను ప్రయాణికులకు చూపిస్తుంది.
Also Read: ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌక 'గంగా విలాస్'.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం..
ఈ క్రూయిజ్ వారణాసిలో ప్రయాణం ప్రారంభించిన మూడో రోజుకే బిహార్‌లో నదీ లోతు తగ్గడం మూలంగా ఒడ్డుకు చేరలేకపోయిందని వార్తలు వచ్చాయి. అవి అవాస్తవాలని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది.