న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా జలాల పంపకాలపై నెలకొన్న వివాదాలపై కేంద్ర జలశక్తి వనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ లతో ఆయన వచ్చే నెల 5వ తేదీన సమావేశం నిర్వహించనున్నారు. 

ఆ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. గోదావరి, కృష్ణా నదీ జలాల పంపకాలపై ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై, చేసిన పిర్యాదులపై చర్చ జరుగుతుంది. రెండు నదలు నీటి పంపకంపై ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తారు.  

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, తాము వరద జలాలను మాత్రమే వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. 

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన కొన్ని ప్రాజెక్టులపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాల పంపకంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది.