Asianet News TeluguAsianet News Telugu

జీ20 సదస్సు : మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడకు ఆహ్వానం పంపిన కేంద్రం..

దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి జీ20 సదస్సు జరగనుంది. అందులో భాగంగా జరిగే జీ20 డిన్నర్ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడలకు కేంద్రం ఆహ్వానం పంపింది. దీంతో వారు కూడా ఈ డిన్నర్ కు హాజరయ్యే అవకాశం ఉంది.

G20 Summit: Center sent invitation to former Prime Ministers Manmohan Singh, Deve Gowda..ISR
Author
First Published Sep 8, 2023, 8:58 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే 18వ జీ20 శిఖరాగ్ర సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 మందికి పైగా ప్రపంచ నేతలు, వారి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెన్ ఓ మాలీ డిల్లాన్, ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ అనీ టొమాసిని సహా ఎయిర్ ఫోర్స్ వన్లో కీలక వ్యక్తులు ఈ కార్యక్రమంలో పొల్గొననున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన బృందంతో కలిసి భారతదేశానికి బయలుదేరారు.

కాగా.. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రముఖలను కూడా ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే జీ20 సమ్మిట్ లో జరిగే విందుకు హాజరు కావాల్సిందిగా మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడలకు కేంద్రం ఆహ్వానం పంపినట్టు వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ వర్గాలు పేర్కొన్నాయి. 

ప్రపంచ దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. దాదాపు 55 వేల మంది భద్రతా సిబ్బంది దీని కోసం పని చేస్తున్నారు. అత్యాధునిక సీసీ కెమెరాలు దేశ రాజధానిని నిఘాలో ఉంచాయి. అయితే ఢిల్లీలో పని చేస్తున్న అనేక ఐటీ కంపెనీలు ఈ సమావేశం జరిగే రోజుల్లో తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

అలాగే నేటి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దేశ రాజధానిలో బ్యాంకులు, ఆర్ధిక, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ విషయంలో ఆగస్ట్ 23వ తేదీనే ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు గాను కార్యాలయాలు, పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాలలు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించుకోవాలని సూచించింది. 

కాగా.. భారతదేశం డిసెంబర్ 1, 2022న ఇండోనేషియా నుండి జీ20 అధ్యక్ష పదవిని స్వీకరించింది. అప్పటి నుంచి ఆగస్టు 2023 వరకు దాదాపు 200 సమావేశాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించారు. అయితే కీలకమైన జీ20 సమ్మిట్ మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి జరగనుంది. ఈ సదస్సు అనంతరం జీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్ అధ్యక్షుడు లూలాకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు అందజేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios